మంత్రిపైనే ఆశలు
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:08 AM
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆదివారం అమాత్యుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ప్రజలు కోటి ఆశలను పెంచుకుంటున్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు.
-పునరుద్ధరణకు నోచుకోని ఎన్‌డీఎస్‌ఎల్
-నిధుల లేమితో జరగని కొండగట్టు అభివృద్ధి
-తీరని కొత్త మండలాల ఆకాంక్ష
-నేడు మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు అడ్లూరి రాక
జగిత్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆదివారం అమాత్యుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ప్రజలు కోటి ఆశలను పెంచుకుంటున్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. ముత్యంపేట నిజాం దక్కన్ షుగర్ కర్మాగారం (ఎన్‌డీఎస్‌ఎల్) పునరుద్ధరణ, కొండగట్టు దేవస్థానం పర్యాటక అభివృద్ధి, ధర్మపురి దేవస్థాన అభివృద్ధి, రోళ్లవాగు ప్రాజెక్టు, సూరారం ప్రాజెక్టుల అభివృద్ధి పనులు, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయడం, కోరుట్ల పశు వైద్య కళాశాలకు యూనివర్సిటీ హోదా తదితర సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు.
ఫఉపాధి కోల్పోయిన ఎన్‌డీఎస్‌ఎల్ కార్మికులు
ఉమ్మడి జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు పొందిన ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారం లే ఆఫ్‌తో మూతపడి ఏడేళ్లుగా తెరుచుకోవడం లేదు. లేఆఫ్ విధించాక యంత్రాల నిర్వహణ ఉండడం లేదు. రూ.300 కోట్ల విలువ చేసే పలు యంత్రాలు ఆయిలింగ్ లేక తుప్పు పడుతున్నాయి. ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగారం పరిధిలో 500 మంది పర్మనెంట్, సీజనల్, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేసేవారు. 150 లారీల్లో చెరుకును కర్మాగారానికి చేర్చడం జరుగుతుండేది. ప్రస్తుతం వీరంతా వీదిన పడి ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్నారు. జిల్లాలో చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన అనంతరం ఫ్యాక్టరీలను పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం, ఫ్యాక్టరీ బకాయిలను చెల్లించి రుణ విముక్తి కల్పించడం వంటి చర్యలను తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చెరుకు సాగుకు, ఫ్యాక్టరీకి పూర్వవైభవం రావాలన్న ఆకాంక్షతో సంబంధిత వర్గాలున్నాయి.
ఫనత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు..
జిల్లాలో ప్రధానంగా ఎస్సారెస్పీ కింద 1,87,890 ఎకరాలు సాగువుతోంది. సారంగపూర్, ధర్మపురి తదితర ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి రూ.187 కోట్లతో నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్టు, బొళ్లి చెరువు పనులు ఇంకా పూర్తి కాలేదు. కథలాపూర్ మండలంలో రూ.204 కోట్లతో నిర్మించాలనుకున్న సూరమ్మ రిజర్వాయర్ పనులు సైతం పూర్తి కాలేదు. సూరమ్మకు కుడి, ఎడమ కాలువలను స్టేజ్ 2, ఫేజ్ 1లో భాగంగా తవ్వి మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలల్లోని సుమారు 43 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువల మరమ్మతు పనులు చేయాల్సి ఉంది.
ఫకలగానే మామిడి బోర్డు ఏర్పాటు..
జిల్లాలో మామిడి బోర్డు ఏర్పరచకపోవడం, మద్దతు ధర ప్రకటించకపోవడంతో మామిడి రైతులు వ్యాపారుల ఉచ్చుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు జాతీయ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ జగిత్యాల జిల్లాలో పసుపు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై పాలకులు పట్టించుకోవడం లేదు. పసుపు క్వింటాలుకు రూ. 15వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక మామిడి, పసుపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరగాల్సి ఉంది.
ఫకొండగట్టులో మాస్టర్‌ప్లాన్ అమలుపై ఆశలు
కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పక కృషి చేస్తారనే ఆశాభావాన్ని భక్తులు వెలిబుచ్చుతున్నారు. ఇక్కడకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర జిల్లాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. పదిహేనేళ్లుగా ప్రతిపాదనల గడప దాటని మాస్టర్ ప్లాన్ అమలుకు చొరవ చూపించాల్సి ఉంది. దేవస్ధానానికి ఐఏఎస్ అధికారిని నియమించి దేవస్థానం వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంది. గతంలో కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రమాదంలో 67 మంది మృతిచెందగా అనేక మంది మంచాలకే పరిమితమయ్యారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రత్యేక ప్రణాళికతో ఆదుకోవాలన్న డిమాండ్ ఉంది. గత బీఆర్‌ఎస్ సర్కారు ప్రారంభించిన రామ కోటి స్థూపం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కొండగట్టులో రోప్‌వే ఏర్పాటు జాడ కనిపించడం లేదు. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, మల్లాపూర్ కనకసోమేశ్వరస్వామి గుట్ట, పైడిమడుగు, భూషణ్‌రావుపేట మర్రవ్వ ఆలయాలు, నాగులపేట నాగులమ్మ ఆలయం, పెద్దాపూర్ మల్లన్న ఆలయం, వెల్గటూరు మండలం కోటిలింగాల దేవస్థానాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
ఫయూనివర్సీటీ హోదాకు నోచుకోని పశు వైద్య కళాశాల
కోరుట్ల పశువైద్య కళాశాలను అప్‌గ్రేడ్ చేసి విశ్వవిద్యాలయ హోదా కల్పించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు స్థలసేకరణకే పరిమితమమైంది. జిల్లాలోని రాయికల్ మండలం అల్లీపూర్, ఒడ్డెలింగాపూర్, మెట్‌పల్లి మండలం బండలింగాపూర్, జగ్గసాగర్‌లను మండలాలుగా ప్రకటించాలన్న డిమాండ్ ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితం చేయకుండా అర్హులందరికీ కల్పించాలని పలువురు కోరుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ అమలు, ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి.
ఫఆరు నెలలగా నిలిచిన పనులు...
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు దశల్లో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు. మొదటి దశగా రూ.14 కోట్లు వెచ్చించి కళాశాల తరగతుల నిర్వహణ, తాత్కాలిక భవనాల ఏర్పాటు, ఇతర భవనాల అభివృద్ధి తదితర పనులను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లింపు జరిపింది. రెండో దశలో భాగంగా రూ.115 కోట్ల నిధులతో మెడికల్ కళాశాల భవన నిర్మాణం, బాలుర, బాలికల వసతి గృహాలు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వం మారడం, నిధుల కేటాయింపులు లేకపోవడం వల్ల పనులపై తీవ్ర ప్రభావం చూపింది. సకాలంలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్ గత ఆరు నెలలుగా పనులు చేయడం నిలిపివేశారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల భవనానికి సంబంధించిన స్లాబ్‌లు, బ్రిక్స్ వర్క్స్ పూర్తయ్యాయి. బాలుర, బాలికల వసతి గృహాలకు సంబందించిన స్లాబ్ నిర్మాణాలు జరిగినప్పటికీ బ్రిక్స్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రెండో దశ పనులు పూర్తయితే మూడో దశలో మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, ల్యాబ్స్ నిర్మాణం, ప్రిన్సిపాల్, ఆయా డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు క్వార్టర్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేయాల్సి ఉంది.
-మంత్రికి ఘన స్వాగతానికి కాంగ్రెస్ ఏర్పాట్లు
మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మంగళవారం జగిత్యాల జిల్లాకు రానున్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన ఖరారైంది. మంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. జిల్లా సరిహద్దులోని పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద స్వాగతం పలకనున్నారు. అక్కడినుంచి రాజారాంపల్లె, వెల్గటూరు, రాయపట్నం మీదుగా ధర్మపురికి చేరుకోనున్నారు. ధర్మపురిలోని లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకుంటారు. ధర్మపురిలో లక్ష్మీ నృసింహ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు.
Updated Date - Jun 10 , 2025 | 01:08 AM