విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:53 AM
విద్యారంగానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు.
- పదో తరగతి విద్యార్థులందరికీ మోదీ కానుకగా సైకిళ్ల పంపిణీ
- నెల రోజుల్లో అందరికీ అందజేస్తాం
- ఎంపీగా ఉన్నంతకాలం సైకిళ్లు అందజేస్తాం
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్, జులై 9 (ఆంధ్రజ్యోతి): విద్యారంగానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో (2014-15 బడ్జెట్‌లో) విద్యా రంగానికి కేంద్రం 68,712 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే(2025-26) 1,28,650 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. పాఠశాలలను నడిపే బాధ్యతను, స్థానిక భాషలో పాఠ్యంశాలు బోధించే అంశాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో విద్యా రంగం ముందుకు సాగుతుందనే నమ్మకంతోనే జాతీయ విద్యా విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో మోదీ కిట్స్‌ను అందజేయబోతున్నామన్నారు. ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్ష మంది ఉన్నా వాళ్లందరికీ మోదీ కిట్స్‌ను అందిస్తామన్నారు. తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను అందజేస్తామన్నారు.
ఫ త్వరలో విద్యార్థులకు మోదీ కిట్స్
మోదీ కానుకగా ఇప్పుడు సైకిళ్లు అందిస్తున్నామని, త్వరలో విద్యార్థులందరికి మోదీ కిట్స్ అందించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని తనలో నింపిన నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే కలెక్టర్ అన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ ప్రతిపాదించారన్నారు. ఆ ఆలోచనతోనే ఈరోజు పదో తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవి ప్రభుత్వ నిధులు కావని, అట్లని తాను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదన్నారు. తన దగ్గరకు వచ్చిన కొందరు కార్పోరేట్ కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత సీఎస్సార్ ఫండ్ కింద ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి ఇచ్చిన నిధులతో సైకిళ్లను కొని పంపిణీ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం తమ అందరికీ ఆదర్శమన్నారు. ఇతర ప్రజా ప్రతినిధులు కూడా స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లను పంపీణీ చేయాలని భావిస్తున్నారన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు 20 వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయమన్నారు. చిన్నప్పుడు తనకు సైకిలే ఆస్తి అన్నారు. ఈ సైకిళ్లతో విద్యార్థులు ఎవరిపై ఆధారపడకుండా సమయానికి స్కూల్‌కు వెళ్లి వచ్చే అవకాశముంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ నడపడం అలవాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో మహేశ్వర్, డీఈవోతో శ్రీరాం మొండయ్య, అధికారులు హాజరయ్యారు.
Updated Date - Jul 10 , 2025 | 12:53 AM