అతివల్లో ఉపాధి ఆశలు.. నేతన్నల్లో నిరాశ..
ABN, Publish Date - Apr 11 , 2025 | 01:08 AM
సిరిసిల్ల మగ్గం బతుకులు ఎప్పుడూ ఆగమే. పొద్దస్తమానం పోగు పోగును పేని అందమైన చీరలు, వస్త్రాలు నేసే నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల మగ్గం బతుకులు ఎప్పుడూ ఆగమే. పొద్దస్తమానం పోగు పోగును పేని అందమైన చీరలు, వస్త్రాలు నేసే నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నారు. పడుగు పోగులు, ఉరితాళ్లుగా వేలాడుతుంటే నిత్యం బతుకు చప్పుళ్లు వినిపించిన మరమగ్గాలు ఎప్పుడూ నేతన్నలు వెక్కిరిస్తూనే ఉంటాయి. ఈక్రమంలో నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వ ఆర్డర్లు భరోసా కల్పిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అందిన ఆర్డర్లలో మార్పులు తీసుకవచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడంలో చేసిన జాప్యం సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలోకి వెళ్లింది. దాదాపు 15మందికి పైగా కార్మికులు ఉరిపోసుకున్నారు. వామపక్ష పార్టీలు, పవర్‌లూం కార్మిక సంఘాలు, వస్త్రోత్పత్తిదారుల సంఘాల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం మళ్లీ స్వశక్తి మహిళల కోసం చీరల ఆర్డర్లు, విద్యార్థులకు యూనిఫాం బట్ట ఉత్పత్తి వంటివి ఇవ్వడంతో ఉపశమనం పొందారు. విద్యుత్ రాయితీ పది హెచ్‌పీల నుంచి 25 హెచ్‌పీలకు పెంచారు. కొంత బకాయిల సమస్య వెంటాడుతోంది. స్వశక్తి చీరలకు రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన యారన్ డిపో ఆధారంగా నిలిచింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో బీడీలు చుట్టే కార్మికులు, వస్త్రోత్పత్తి రంగంలో ఉన్న మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి కల్పించడానికి పూనుకుంది. ఆ దిశగానే సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్-పెద్దూర్‌ల వద్ద మహిళల కోసం గార్మెంట్ రంగంలో పరిశ్రమలు తీసుకవచ్చే దిశగా అపెరల్ పార్కు, పవర్‌లూం కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ పథకం కోసం వీవింగ్ పార్కు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అపెరల్ పార్కులో వస్తున్న యూనిట్లతో మహిళలకు ఉపాధి లభిస్తుండగా వర్కర్ టు ఓనర్ పథకం కోసం నేతన్నలు ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. శుక్రవారం అపెరల్ పార్కులో బెంగుళూరుకు చెందిన అంతర్జాతీయ సంస్థ టెక్స్‌పోర్టు యూనిట్‌ను ప్రారంభించడానికి చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేలు పరిశీలించారు.
ఉపాధిని అందిస్తున్న అపెరల్ పార్కు..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా సిరిసిల్ల పెద్దూర్ శివారులో మహిళ కార్మికుల కోసం 60 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూ.174 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లను కేటాయించారు. అపెరల్ పార్కులో గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి పొందే దిశగా మహిళలకు జూకీ కుట్టు మిషన్లపై మహిళలకు శిక్షణను అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో అపెరల్ పార్కులో 2021 ఏప్రిల్‌లో గోకుల్‌దాస్ ఇమేజ్ గార్మెంట్ సంస్థ యూనిట్‌ను ప్రారంభించింది. 800 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రారంభించిన యూనిట్‌ను 1600 మందికి ఉపాధి కల్పించే దిశగా విస్తరించింది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికా లాంటి దేశాలకు రేడిమేడ్ వస్త్రాలు ఎగుమతి చేస్తుంది. ఇదే దిశగా బెంగుళూరుకు చెందిన అంతర్జాతీయ గార్మెంట్ రంగ సంస్థ టెక్స్‌పోర్టు కంపెనీ యూనిట్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. ఈ కంపెనీ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. యూనిట్ ప్రారంభోత్సవానికి నలుగురు మంత్రులు రానున్న నేపధ్యంలో మరింత ఉపాధి అవకాశాలు పెరిగే దిశగా హామీ ఇస్తారని భావిస్తున్నారు.
వర్కర్ టు ఓనర్ పథకానికి నేతన్నల ఎదురుచూపులు...
సిరిసిల్ల శివారులో నేతన్నలకు ఉపాధికి వారధిగా ఉన్న అపెరల్ పార్కు, వీవింగ్ పార్కులలో నేత కార్మికులు, వస్త్రోత్పత్తిదారులకు ఆశ, నిరాశలుగా మిగిలాయి. అపెరల్ పార్కులో యూనిట్లు ప్రారంభం అవుతుండగా కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ పథకం కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ సంవత్సరం ఉగాది నాటికే మరమగ్గాల యూనిట్లను స్థాపించే విధంగా కసరత్తు ప్రారంభించినా ముందుకు కదలడం లేదు. గత ప్రభుత్వం చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, నిర్మాణం పూర్తి చేసుకున్న షెడ్లలో ఇతర సంస్థలకు లీజుకు ఇవ్వడంతో పవర్‌లూం కార్మికుల్లో పథకంపై ఆశలు సన్నగిల్లాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.386.88 కోట్లతో పవర్‌లూం కార్మికులను యజమానులుగా మార్చే పథకాన్ని అమలుచేయడానికి సన్నాహాలు ప్రారంభించడంతో కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపించకపోవడంతో ఎదురుచూపులే మిగిలిస్తున్నాయి. మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చే దిశగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూపకల్పన చేశారు. ఇందుకు అనుగుణంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద వీవింగ్ పార్కు నిర్మాణం చేపట్టారు. 42 వీవింగ్ షెడ్లు నిర్మాణం జరిగింది. కార్మికులకు నచ్చే విధంగా సెమీ ఆటో మరమగ్గాలను నమూనాగా ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద 88 ఎకరాల్లో రూ.374 కోట్లతో వీవింగ్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 1,104 మంది కార్మికులకు వర్క్‌షెడ్లను నిర్మించి అందించాలనే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రోడ్లు, నీటి వసతి, కరెంట్, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించారు. 46 వర్క్‌షెడ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణాలు 42 షెడ్లు పూర్తి చేశారు. ఇందులో కార్మికులకు మొదటి విడతలో 4,416 మరమగ్గాలను గ్రూప్ షెడ్ల కింద అందించనున్నారు. ఒక్కొ కార్మికుడికి 800 చదరపు అడుగుల్లో స్టోర్‌రూంతో కలిపి అందిస్తారు. ఇందులో నాలుగు సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలు, కండెలు చుట్టే యంత్రం, ఇస్తారు. పార్కులో 60 వార్పిన్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్ ధర 8 లక్షలుగా ముందుగా నిర్ణయించారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.16.52 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో 10 శాతం లబ్ధిదారుని వాటాధనం 50 శాతం ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంక్ రుణం ఉండే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. సిరిసిల్లలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేస్తున్న వీవింగ్ పార్కులో కొందరికే మరమగ్గాల యూనిట్లు దక్కే అవకాశం ఉండడంతో మిగతా కార్మికులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో జియో ట్యాగింగ్ చేసిన మరమగ్గాలు 30,352 ఉన్నాయి. వీటిపై 6,500 మంది పనిచేస్తున్నారు. అనుబంధ పరిశ్రమల్లో మరో 6 వేల మంది వరకు పనిచేస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వం మొదటి దశలో కేవలం 1,104 మందికే యూనిట్లను అందించడంతో మిగతా కార్మికులు నిరీక్షించే పరిస్థితి ఉంది. ప్రస్థుతం ప్రభుత్వం పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా రూ 386.88 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు పూనుకుంటారని కార్మికుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.
టెక్స్‌టైల్ జోన్‌పై నెరవేరని ఆశలు..
సిరిసిల్ల నేతన్నల దశాబ్దాల కల మెగా పవర్‌లూం క్లస్టర్. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మెగా క్లస్టర్‌లు ఇస్తున్నా సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రం నిరాశను మిగిలిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిరిసిల్లను మెగా పవర్‌లూం లేదా క్లస్టర్‌గా మారుస్తుందని అందుకు అనుగుణంగా బడ్జెట్ వస్తుందని ప్రతిసారి బడ్జెట్ సమయంలో ఎదురుచూసిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు నిరాశనే కలిగిస్తున్నాయి. తాజా కేంద్ర. రాష్ట్ర బడ్జెట్‌లో మళ్లీ మెగా పవర్‌లూం క్లస్టర్‌పై నిరాశే మిగిలింది. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సిరిసిల్ల వస్త్ర సంక్షోభ సమయంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సిరిసిల్లలో పర్యటించి టెక్స్‌టైల్ జోన్, మెగా పవర్‌లూం క్లస్టర్‌గా మార్చి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శాశ్వత ఉపాధికి పవర్‌లూం క్లస్టర్ దోహాదపడుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం హామీలకే పరిమితమయ్యింది. తెలంగాణ ప్రభుత్వమైనా వరంగల్ తరహాలో భారీ టెక్స్‌టైల్ పరిశ్రమలకు బడ్జెట్ ఊతమిస్తారని భావించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంవత్సర కాలంగా ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రభుత్వం దృష్టి సారించడంతో వస్త్ర పరిశ్రమలో ఆశలు చిగురించాయి. గత బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ జోన్‌ను తీసుకవస్తుందని భావించినా ఆరు గ్యారంటీల పథకాలతోనే సరిపెట్టింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్ జోన్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆశాజనకమైన కేటాయింపులు ఉంటాయని భావించినా బడ్జెట్ కేటాయించలేదు. సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును సిరిసిల్లకు రప్పించిన ఎమ్మెల్యే కేటీఆర్ అప్పటి ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్‌లు మెగా పవర్‌లూం క్లస్టర్ హామీని పొందారు. అప్పటి బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. 2004లో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి వద్ద 60 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును రూ.7.73 కోట్లతో ఏర్పాటు చేశారు. టెక్స్‌టైల్ పార్కులో ఆఽధునిక మరమగ్గాలను స్థాపించారు. దేశ విదేశీ మార్కెట్‌లో అమ్ముడుపోయే విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న పార్కులోకి అనుబంధ పరిశ్రమలు రాకపోవడంతో ఉత్పత్తుల్లో మార్పులు రాలేదు. సిరిసిల్లలో లోటెక్నాలజీ మరమగ్గాలపై ఆధునిక ఉత్పత్తులు చేయలేక తరచూ పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూసింది. ఆత్మహత్యలు, సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్ సమయంలో మంత్రి కేటీఆర్ మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి, అప్పటి చేనేత జౌళిశాఖ మంత్రి సంతోష్ గంగువార్‌లను కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలను వివరించారు. మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపించామని తెలపడంతో ఆ బడ్జెట్‌లో పవర్‌లూం క్టస్టర్ చోటు దక్కుతుందని భావించారు. మొదటి విడతలో దేశంలో ఐదు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సిరిసిల్లకు చోటు దక్కలేదు. 2017 బడ్జెట్ సమయంలో అప్పుడు చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నా కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌లు చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కానీ ఆ బడ్జెట్‌లో కూడా మోక్షం లభించలేదు. అదేక్రమంలో 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025 బడ్జెట్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా మార్చే దిశగా మంత్రులు వరాలు కురిపిస్తారని భావిస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్, కలెక్టర్
సిరిసిల్ల శివారులో అపెరల్ పార్కులో టెక్స్‌పోర్టు యూనిట్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు రానున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గురువారం అపెరల్ పార్కులో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ గీతే, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. టెక్స్‌పోర్టు యూనిట్ ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
Updated Date - Apr 11 , 2025 | 01:08 AM