ప్రధాన పార్టీల్లో గ్రూపు రాజకీయాలు
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:27 AM
జగిత్యాలలో ప్రధాన పార్టీలు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో బహుళ నాయకత్వం వల్ల ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. దీంతో ఆయా పార్టీల అధిష్ఠానాలకు జగిత్యాల రాజకీయాలు తలనొప్పిగా మారాయి.
జగిత్యాల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలలో ప్రధాన పార్టీలు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో బహుళ నాయకత్వం వల్ల ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. దీంతో ఆయా పార్టీల అధిష్ఠానాలకు జగిత్యాల రాజకీయాలు తలనొప్పిగా మారాయి. త్వరలో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు ఎన్నికలు జరగనుండడంతో ఆయా రాజకీయ పక్షాల్లో నెలకొన్న పరిస్థితి అటు కార్యకర్తలకు, ఇటు అధిష్ఠానాలకు ఇబ్బందిగా తయారైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుండా పోతాయన్న ఆందోళన ఆయా పార్టీల శ్రేణుల్లో నెలకొంది.
ఫఎమ్మెల్యే పార్టీ మార్పుతో కాంగ్రెస్‌లో మారిన రాజకీయం..
కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కనుసన్నల్లో ఉంటూ వస్తున్నాయి. కానీ 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, 2025 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలుకావడంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత కొరవడినట్లయింది. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ తరపున 2014లో మొదటిసారి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోగా, ఆ తర్వాత 2019, 2024ల్లో జరిగిన ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి జగిత్యాల కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. అప్పటి వరకు జగిత్యాల కాంగ్రెస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అటు జీవన్‌రెడ్డి, ఇటు సంజయ్ కుమార్ మద్య రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. దీంతో ఆ గట్టున ఉండాలా...ఈ గట్టున ఉండాలా తెలియక కార్యకర్తలు తికమక పడుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎవరిది పైచేయి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇటేవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకవైపు ఇన్నాళ్లు తన వెన్నంటి ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ల మధ్య మంత్రి ఇరకాటంలో పడినట్లయింది.
ఫబీఆర్‌ఎస్‌లో పార్టీలో..
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కొనసాగుతున్నారు. కానీ జగిత్యాలలో మాత్రం ఎమ్మెల్సీ ఎలగందుల రమణ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్ బాధ్యతలను నిర్వర్తించిన జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరి సంజయ్ కుమార్ పార్టీని వీడడంతో క్యాడర్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కొంత క్యాడర్ ఎమ్మెల్యే సంజయ్ వెంట ఉండగా, మరికొంత క్యాడర్ విడిపోయింది. ఎమ్మెల్సీ రమణ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత సురేశ్‌లకు సమీపంగా కొంత మంది కార్యకర్తలుంటున్నారు. వీరిలో ఎమ్మెల్సీ రమణ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దగ్గరగా ఉంటారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ఎమ్మెల్సీ కవితకు దగ్గరగా ఉంటారు. ప్రస్తుతం జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంతనే అన్నీ తానై పట్టించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా వీలు కుదిరినప్పుడల్లా జగిత్యాలలో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని మరీ వస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకున్న ఎమ్మెల్సీ కవిత వ్యవహారం జగిత్యాలపై ప్రభావం చూపుతోంది. ఎవరి వెంట ఉండాల్లో, భవిష్యత్తులో ఎవరిది పై చేయిగా నిలుస్తుందో తెలియని గందరగోళ పరిస్థితిని బీఆర్‌ఎస్ క్యాడర్ ఎదుర్కొంటోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పైచేయిగా ఉంటుందోనని నాయకులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు.
ఫమొదటి నుంచి బీజేపీలో బహుళ నాయకత్వమే..
జగిత్యాల బీజేపీలో చాలా ఏళ్లుగా బహుళ నాయకత్వమే నడుస్తుందనే చెప్పవచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ముదుగంటి రవీందర్‌రావు, మోరపల్లి సత్యనారాయణల వర్గాలు వేర్వేరుగానే పార్టీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ భోగ శ్రావణి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో అప్పటి నుంచి ఆమెది మరో వర్గంగా కొనసాగుతోంది. జగిత్యాల బీజేపీ రాజకీయాలపై పట్టు ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీసుకోబోయే నిర్ణయాలపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మోరపల్లి సత్యనారాయణ ఇటీవల పదవీ కాలం ముగియడంతో మెట్‌పల్లికి చెందిన నాయకుడు డాక్టర్ యాదగిరికి జిల్లా బాధ్యతలను పార్టీ అప్పగించింది. అయితే జగిత్యాల రాజకీయాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అంతగా దృష్టి సారించడం లేదని కార్యకర్తలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కేదెలా అని కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇలా అన్ని ప్రధాన పార్టీల్లో పలువురు రాజకీయ నాయకులు తమ అనుచర వర్గాలతో పార్టీల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బహుళ నాయకత్వాలపై ఆయా పార్టీల అధిష్ఠానాలు దృష్టి సారిస్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 18 , 2025 | 01:27 AM