సంతాన సాఫల్య కేంద్రాలపై సర్కార్ నజర్
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:20 AM
సికింద్రాబాద్‌లోని సృష్టి సరోగసీ కేంద్రం ఘరానా మోసం నేపథ్యంలో ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాల నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించింది.
-నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు
-ఆర్‌ఎంపీలు, పీఆర్వీలతో నెట్‌వర్క్ దందా
-జిల్లాలోని కేంద్రాల పనితీరుపైనా సందేహాలు
-తనిఖీలకు ప్రత్యేక బృందాలు
జగిత్యాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని సృష్టి సరోగసీ కేంద్రం ఘరానా మోసం నేపథ్యంలో ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాల నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని, 35 తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాల్లో సైతం తనిఖీలు జరగనున్నాయి. జిల్లాలోని కేంద్రాల పనితీరుపై సైతం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నవి కేవలం నాలుగు మాత్రమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.
ఫనిబంధనల ప్రకారం..
వివాహమై చాలా ఏళ్లయినా సంతానం కలగని దంపతులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలున్న కొంతమంది దంపతులు ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కాగా పలు కేంద్రాల నిర్వాహకులు ఆర్‌ఎంపీ, పీఎంపీలు, ఆసుపత్రుల పీఆర్వోలతో నెట్‌వర్క్ దందాను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహించాలంటే వైద్య శాఖ కమిషనరేట్ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. ఫెర్టిలిటీ కేంద్రాల్లో దంపతులను పరీక్షించిన తర్వాత ఎవరిలో లోపం ఉందో గుర్తించి వారికి చికిత్స అందించాలి. దంపతుల నుంచి వీర్యకణాలు, అండాలు సేకరించి రెండు రకాల చికిత్స పద్దతుల (ఇంట్రా యూటిరైన్ ఇన్‌సెమినేషన్-ఐయూఐ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్-ఐవీఎఫ్) ద్వారా సంతానం పొందే అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో దంపతుల అంగీకారం మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది.
ఫఅనుమతి లేకుండా నిర్వహణ
జిల్లాలో ప్రభుత్వ అనుమతితో నాలుగు సంతాన సాఫల్య కేంద్రాలు పనిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. కాగా కొందరు గైనకాలజిస్టులు ఎలాంటి ఫెర్టిలిటీ నిర్వహణ అనుమతులు లేకుండా ఆసుపత్రుల మాటున సంతాన సాఫ్యల చికిత్సలు అందిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సంతానం కోసం వచ్చే దంపతులకు పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారు. కొందరు సంతాన సాఫల్య కేంద్రంగా పేరు పెట్టుకొని చికిత్స నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా కేంద్రాల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి. దంపతులకు తెలియకుండా ఇతర దాతల నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ప్రవేశపెట్టి సంతానం కలిగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఫనర్సింగ్ హోంల ముసుగులో...
నర్సింగ్‌హోంలు, ఆసుపత్రులకు జిల్లా వైద్యాధికారి అనుమతులు ఇస్తారు. ఐయూఐ, ఐవీఎఫ్, సరోగసి సేవల కోసం కమిషనర్, ఫ్యామిలీ హెల్త్, జాయింట్ డైరెక్టర్ల ఆమోదం ఉండాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద తతంగం కావడంతో నర్సింగ్ హోంల ముసుగులో కొందరు దందా సాగిస్తున్నారు. ఆసుపత్రి లోపలే ఆపరేషన్ థియేటర్, చిన్న ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరు పేద యువకులు, మహిళలకు దళారుల ద్వారా గాలం వేస్తున్నారు. కొందరు వైద్యులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతో ఆ ప్రభావం అందరు డాక్టర్లపై పడుతుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫతనిఖీ బృందాల్లో సభ్యులు ఇలా..
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలోని ఈ కమిటీలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఉదయ్ కుమార్, డీఎంఈ నరేంద్ర కుమార్ సభ్యులుగా ఉన్నారు. అలాగే 35 తనిఖీ బృందాల్లోని ఒక్కో తనిఖీ బృందంలో ఒక ప్రభుత్వ వైద్యుడు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తదితరులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో గల సంతాన సాఫల్య కేంద్రాలను ఈ బృందాలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా.. లేదా అని తెలుసుకుంటాయి. స్పెర్మ్ దాతలు, గ్రహీతల వివరాలు సేకరించి వారితో మాట్లాడనున్నాయి. గతంలో ఈ కేంద్రాలపై ఉన్న ఫిర్యాదులు, ఇతర కేసులను పరిశీలించనున్నాయి. సికింద్రాబాద్ తరహాలో సంఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సులు చేయనుంది. దీంతో అక్రమారులు ఆందోళనకు గురవుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. సంతాన సాఫల్య కేంద్రాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బాధితులు ఎవరైనా ఉంటే అధికారులకు తగిన సమాచారం అందించాలి. పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
Updated Date - Aug 04 , 2025 | 01:20 AM