‘పది’ ఫలితాల్లోనూ బాలికలదే హవా..
ABN, Publish Date - May 01 , 2025 | 12:32 AM
పదో తరగతి ఫరీక్ష ఫలితాల్లో మళ్లీ బాలికలదే హవా కొనసాగింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేసి పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని తగ్గించుకుంది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 98.15 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ఈసారి పదో తరగతిలో సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు, గ్రేడ్‌లను కూడా వెల్లడించారు.
- జిల్లాలో 98.15 శాతం ఉత్తీర్ణత
- 6754 మంది విద్యార్థులకు 6629 మంది పాస్
- రాష్ట్రంలో ఐదో స్థానంలో రాజన్న సిరిసిల్ల
- గత సంవత్సరం జిల్లాది మూడో స్థానం
- జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పదో తరగతి ఫరీక్ష ఫలితాల్లో మళ్లీ బాలికలదే హవా కొనసాగింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేసి పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని తగ్గించుకుంది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 98.15 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ఈసారి పదో తరగతిలో సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు, గ్రేడ్‌లను కూడా వెల్లడించారు. ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్ట్‌లను క్లియర్ చేయని విద్యార్థుల కోసం జూన్‌లో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా పరీక్ష రుసుము చెల్లించాలని సూచిస్తున్నారు. జిల్లాలో 6,754మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా 6,629 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3,119 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 3,041 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,635 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 3,588 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.15 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 97.50 శాతం, బాలికలు 98.71 శాతం ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారిలో మరోసారి బాలికలే ముందంజలో నిలిచారు. బాలురు 3,041 మంది, బాలికలు 3,588 మంది ఉత్తీర్ణులుకాగా, బాలికలు 547 మంది ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఈ సంవత్సరం పది ఫలితాల్లో 125 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 3,119 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 78 మంది, 3635 మంది పరీక్షలకు హాజరు కాగా 47 మంది ఫెయిల్ అయ్యారు.
కేజీబీవీల్లో విద్యార్థినుల జోష్..
జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినులు జోష్ చూపించారు. జిల్లాలో 13 కేజీబీవీల్లో పది పరీక్షల్లో 506 మంది విద్యార్థులు హాజరుకాగా 503 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 99.41 శాతంగా ఉంది. పది కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సిరిసిల్ల కేజీబీవీలో ఎన్ శ్రీనిత్య 566 మార్కులు, ఇల్లంతకుంట కేజీబీవీలో ఏ అర్చిత 564 మార్కులు, తంగళ్లపల్లి కేజీబీవీలో జె కృష్ణవేణి 563 మార్కులు సాధించారు. కేజీబీవీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను డీఈవో జనార్థన్‌రావు అభినందించారు.
సంవత్సరాల వారీగా
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
2016 - 2017 87.3
2017 - 2018 91.3
2018 - 2019 97.7
2019 - 2020 100
2020 - 2021 100
2021 - 2022 95.76
2022 - 2023 94.37
2023 - 2024 98.27
2024- 2025 98.15
Updated Date - May 01 , 2025 | 12:32 AM