లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:22 AM
లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో చాంబర్‌లో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
సుభాష్‌నగర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో చాంబర్‌లో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయబోమని సూచించే బోర్డులను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. అయినా ఎవరైనా ఈ పరీక్షలు చేస్తే సమాచారాన్ని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లను స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. సమావేశంలో పీసీ, పీఎన్‌డీటీ పీవో డాక్టర్ సనా జవేరియా, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పిడియాట్రీషియన్ డాక్టర్ వేణు, ప్రకృతి స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు వసంతకుమార్, డెమో రాజగోపాల్, కైక, హెచ్‌ఈ సయీద్‌సాబిర్, ఎంపీహెచ్‌ఎస్ రమేశ్ పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి కాన్పుకు వచ్చేవారిని సాధారణ ప్రసవం చేసుకోవాలని, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. గర్భిణులు అన్నిరకాల వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని, వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. 30 సంవత్సరాల పైవారందరికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించాలని, వారందరికి క్రమం తప్పకుండా మందులు అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనాజవేరియా, పీవోఎంసీడీ డాక్టర్ విప్లవశ్రీ, డెమో రాజగోపాల్, ఎన్‌హెచ్ ఎండీపీవో స్వామి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:22 AM