‘బోగస్’పై ఫోకస్..
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:04 AM
బోగస్ రేషన్ లబ్ధిదారులపై సర్కార్ దృష్టి పెట్టింది. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలోనే అనర్హులను ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
- ఆరునెలలుగా రేషన్‌కు రాని కార్డుదారుల గుర్తింపు
- క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత చర్యలు
- గత నెలలో 1,102 కార్డులపై విచారణ
- 797 మంది సభ్యుల తొలగింపు
- చివరి దశకు మూడు నెలల సన్న బియ్యం పంపిణీ
- జిల్లాలో 98.59 లక్షల సబ్సిడీ బియ్యం కోటా
- జిల్లాలో రేషన్ లబ్ధిదారులు 5.35 లక్షల మంది
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బోగస్ రేషన్ లబ్ధిదారులపై సర్కార్ దృష్టి పెట్టింది. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలోనే అనర్హులను ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలంలో రవాణా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున పేదలకు మూడు నెలలు బియ్యం కోటాను ఒకేసారి ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 85 శాతం పైగా సన్న బియ్యం పంపిణీ పూర్తి చేశారు. ఇదే సమయంలో బోగస్ కార్డులను తొలగించే ప్రక్రియకు పూనుకుంటోంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో రేషన్ దారుల జాబితాను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
జిల్లాలో ఇప్పటికే 797 మంది తొలగింపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల రేషన్ డీలర్ల ద్వారా సేకరించిన వివరాలు ఆధారంగా 1,102 రేషన్ కార్డులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపారు. ఇందులో 1,707మంది సభ్యులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి 797 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. జిల్లాలో తొలగించిన వారిలో బోయిన్‌పల్లిలో 68 మంది, చందుర్తిలో 39 మంది, ఇల్లంతకుంటలో 114 మంది, గంభీరావుపేటలో 86 మంది, కోనరావుపేటలో 90మంది, ముస్తాబాద్‌లో 75మంది, రుద్రంగిలో 24మంది, సిరిసిల్లలో 147మంది, తంగళ్లపల్లిలో 15మంది, వీర్నపల్లిలో 18మంది, వేములవాడ రూరల్‌లో 29 మంది, వేములవాడలో 39 మంది, ఎల్లారెడ్డిపేటలో 53 మందిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించాలి.
రేషన్‌కు రాకుంటే ‘కార్డు’ కట్
బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. జూన్ మాసంలో వర్షాకాల సీజన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తున్నారు. ఇదేక్రమంలో ప్రజా పంపిణీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకొవడానికి రాని లబ్ధిదారులను గుర్తించారు. ఈ జాబితా ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోనున్నది. స్థానికంగా లేనివారు, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లినవారు, మృతుల పేర్లను కార్డులో నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు.
జిల్లాలో 1,77,851 రేషన్ కార్డులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 345 రేషన్ దుకాణాలు ఉండగా, 1,77,851 రేషన్ కార్డులు, 5,35,920 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 13,748, ఆహార భద్రత కార్డులు 1,63,900, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులు 5,35,920 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ లబ్ధిదారులు 37,389 మంది, ఆహార భద్రత లబ్ధిదారులు 4,98,324 మంది, అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు 207 మంది ఉన్నారు. వీరికి మూడు నెలల కోటా 98.59 లక్షల కిలోల బియ్యం పంపిణీ చివరి దశకు చేరుకుంది.
మూడు నెలల రేషన్ కోటా పంపిణీ ఇలా...
మండలం లబ్ధిదారులు బియ్యం(కిలోల్లో)
బోయినపల్లి 35,224 6,35,698
చందుర్తి 32,671 5,75,444
గంభీరావుపేట 44,049 7,96,665
ఇల్లంతకుంట 45,684 8,10,801
కోనరావుపేట 43,077 7,61,987
ముస్తాబాద్ 45,382 8,21,029
రుద్రంగి 16,155 2,89,183
సిరిసిల్ల 85,726 17,60,795
తంగళ్లపల్లి 42,401 8,11,116
వీర్నపల్లి 14,055 2,55,335
వేములవాడ 60,249 10,64,136
వేములవాడ రూరల్ 22,483 3,97,365
ఎల్లారెడ్డిపేట 48,764 8,80,232
------------------------------------------------------
మొత్తం 5,35,920 98,59,786
------------------------------------------------------
Updated Date - Jun 28 , 2025 | 01:04 AM