సాగునీటిని విడుదల చేయాలని రైతుల రాస్తారోకో
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:10 AM
సాగునీటిని విడుదల చేయాలంటూ మండలంలోని పలు గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు.
ఇల్లంతకుంట, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : సాగునీటిని విడుదల చేయాలంటూ మండలంలోని పలు గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు. మధ్యమానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ పొత్తూరు గ్రామసమీపంలోని వంతెనపై గురువారం రైతులు నిరసనకు దిగారు. రైతుల నిరసనకు బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు మాట్లాడుతూ సరైన వర్షాలు కురియకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొంతమంది రైతులు ఇప్పటివరకు నాట్లు వేయలేదని, మరికొందరి రైతుల చేన్లు ఎండిపోతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదన్నారు. రైతులు కోరినప్పుడు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రైతులు అనేక రోజులుగా సమస్యను వివరిస్తున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇప్పటికైనా స్పందించి కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామన్నారు. దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో వంతెనపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో శాంతించి నిరసన విరమించారు. కార్యక్రమంలో నాయకులు కేవీఎన్‌రెడ్డి, సిద్దం శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్‌లతో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 01:10 AM