రైతుల కల సాకారం
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:48 AM
రామగుండం నియోజకవర్గంలోని ఎస్సారెస్సీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ఏడేళ్ల క్రితం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ పథకంపై ఆశలు పెంచుకున్న రైతుల కల సాకారం కానున్నది. వచ్చే నెల 3వ తేదీన ఈ పథకాన్ని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- పూర్తయిన రామగుండం ఎత్తిపోతల పథకం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రామగుండం నియోజకవర్గంలోని ఎస్సారెస్సీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ఏడేళ్ల క్రితం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ పథకంపై ఆశలు పెంచుకున్న రైతుల కల సాకారం కానున్నది. వచ్చే నెల 3వ తేదీన ఈ పథకాన్ని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్సారెస్పీ డి-83, 17ఎల్, 27ఎల్ ఉప కాలువల ద్వారా 13,386 ఎకరాల భూములను స్థిరీకరించనున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జిల్లా కలెక్టర్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద గోదావరి నదిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించినప్పటికీ, ఇదే ప్రాంతానికి ఆ ప్రాజెక్టు ద్వారా సాగు నీటిని ఇవ్వక పోవడంతో ఎక్కడో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిపైనే రైతులు ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి సక్రమంగా నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు నష్టాల పాలయ్యారు. దీనికి పరిష్కారంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామగుండం ప్రాంత రైతులకు సాగు నీటిని అందించేందుకు ఏడేళ్ల క్రితం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి.
నిధుల కొరతతో పనుల్లో ఆలస్యం
రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని పలు గ్రామాల్లో గల సుమారు 13 వేల ఎకరాలకు పైగా భూములకు ఎస్సారెస్పీ డి- 83, 27ఎల్, 17ఎల్ కాలువల ద్వారా సాగు నీరందుతున్నాయి. ఈ భూములు కాలువకు చివరన ఉండడంతో సక్రమంగా నీళ్లు అందక పంటలు ఎండిపోయాయి. ఇదే ప్రాంతంలో గోదావరిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, ఎస్సారెస్పీ భూములను స్థిరీకరించాలని అప్పటి ప్రభుత్వాన్ని ఈ ప్రాంత రైతులు కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానైనా ఈ ప్రాంతానికి సాగు నీటిని అందించాలని కోరినప్పటికీ సాధ్యం కాలేదు. కనీసం ఒక ఎత్తిపోతల పథకం నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సీఎం కేసీఆర్‌కు పలుసార్లు వినతిపత్రాలు ఇచ్చి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో 2017 డిసెంబర్‌లో 72 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 69 కోట్ల రూపాయలకు పరిపాలన మంజూరు ఇచ్చారు. ఈ పథకానికి భూమి పూజ చేసేందుకు 2018 ఫిబ్రవరి 27న సీఎం కేసీఆర్ స్వయంగా ముర్మూరు వచ్చారు. హైదరాబాద్ సిటీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కోసం ముర్మూరు వద్ద పంప్‌హౌస్‌ను నిర్మించారు. ప్రాజెక్టు నుంచి ఈ పంప్‌హౌస్ వరకు గల అప్రోచ్ కాలువకు ఎడమ వైపున 300 మీటర్ల దూరంలో రామగుండం ఎత్తిపోతల పథకానికి పంప్‌హౌస్ నిర్మించి అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల దూరం వరకు పైప్‌లైన్ వేసి 27ఎల్ కాలువకు లింకు చేయాలని, అప్రోచ్ కాలువకు కుడి వైపున మరో పంప్‌హౌస్ నిర్మించి పైపులైన్ ద్వారా 17ఎల్ కాలువకు లింకు చేయాలని అంచనాలు రూపొందించారు. ఈ మేరకు పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ, నిధుల కొరత వల్ల ఆలస్యమయ్యింది. అర్ధాంతరంగా వదిలేసిన పనులను 2018లో గెలుపొందిన కోరుకంటి చందర్ మొదలు పెట్టించినప్పటికీ, 2023 ఎన్నికల నాటికి కూడా పూర్తి కాలేదు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మిగిలిన పెండింగు పనులతో పాటు ఎలక్ర్టికల్ ప్యానల్ పనులు, అప్రోచ్ కాలువ పనులు, సబ్‌స్టేషన్ నిర్మాణ, తదితర పనులన్నింటినీ పూర్తి చేయించారు. వచ్చే నెల 3వ తేదీన రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఆరంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ పథకం ఆరంభం అయిన తర్వాత ఈ వానాకాలం సీజన్‌కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు డీ-83, 17 ఎల్, 27 ఎల్ కాలువల ద్వారా సాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్ నుంచి ఎస్సారెస్పీ నీటి సరఫరాతో అవసరం లేకుండానే రెండు పంటలకు పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని కొన్ని భూములకు సాగు నీరందనున్నాయి. ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 11.54 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. పథకం ఆరంభం అయిన తర్వాత ప్రాజెక్టు నుంచి రామగుండం ఎత్తిపోతల పథకం ఆయకట్టు భూములకు సాగునీటిని విడుదల చేయనున్నారు.
Updated Date - Jul 31 , 2025 | 12:48 AM