ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు భరోసా సక్సెస్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 01:11 AM

రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సాగు కోసం పెట్టుబడి సాయాన్ని అందించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది.

- నేడు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

- రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం

- ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం

- జిల్లాకు రూ. 211.9 కోట్ల కేటాయింపు

- ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 201.83 కోట్ల జమ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సాగు కోసం పెట్టుబడి సాయాన్ని అందించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న 45 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు వీక్షిస్తారు. ముఖ్యమంత్రితో రైతులు మాట్లాడతారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ఈ ముఖాముఖి రైతు సదస్సులో పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు మండలస్థాయి అధికారులను నోడల్‌ అధికారిగా నియమించారు. ఆయా రైతు వేదికల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చూసేందుకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశాల మేరకు ఇప్పటికే రైతు వేదికల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తమ శాఖ సిబ్బంది ద్వారా రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తున్నారు.

ఫ జిల్లాలో ఇప్పటి వరకు 1,86,952 మందికి అందిన పెట్టుబడి సాయం

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 2,10,904 మంది రైతులకుగాను వారి పట్టాలో ఉన్న భూమికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా సాయాన్ని ఇచ్చేందుకు 211.9 కోట్ల రూపాయలు అవసరవుతాయని గుర్తించి ఆ మేరకు కేటాయింపులు చేశారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు భరోసా సాయం విడుదలను లాంఛనంగా ప్రారంభించి రెండెకరాలలోపు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా నిధుల విడుదలను చేశారు. ఆ రోజు జిల్లాలో 1,24,727 మంది రైతుల ఖాతాల్లో 65.79 కోట్లు, 17న 27,307 మంది లబ్ధిదారులకు 40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు 32.91 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. 20న 9,955 మంది రైతుల ఖాతాల్లో 26.39 కోట్లు, 21న 5,684 మందికి 19.36 కోట్లు, 23న 3,284 మందికి 17.11 కోట్లు జమ చేశారు. 23 వరకు జిల్లాలో మొత్తం 1,86,952 మంది రైతుల ఖాతాల్లో 201.83 కోట్ల రూపాయలు జమ చేశారు. మరో 10 కోట్ల రూపాయలు జమ చేస్తే జిల్లాలోని రైతులందరికి రైతు భరోసా సాయం అంది ఈ సీజన్‌ సాయం అందించే ప్రక్రియ పూర్తవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని ప్రకటించిన విధంగా ఆలోగానే రైతు భరోసా సాయం రైతులకు అందనున్నది.

ఫ సన్నవడ్ల బోనస్‌పై ప్రకటన చేసే అవకాశం

రైతు భరోసా కార్యక్రమం ఈ సీజన్‌లో అనుకున్న విధంగా విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సన్నవడ్ల బోనస్‌ డబ్బు విడుదల చేసే విషయమై ప్రకటన చేయనున్నారని తెలిసింది. ఆ నిధులు కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమవుతాయని సమాచారం. జిల్లాలో గడిచిన యాసంగి సీజన్‌లో 3,10,746 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,77,403 మెట్రిక్‌ టన్నులు దొడ్డు వరిధాన్యం కాగా, 33,343 మెట్రిక్‌ టన్నులు సన్న వరి రకాలు ఉన్నాయి. ప్రభుత్వం సన్నరకం వరిధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన 33,343 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యంపై 16,67,15,000 రూపాయల బోనస్‌ను చెల్లించాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ బోనస్‌ విడుదల విషయంలో ప్రకటన చేస్తారని, త్వరలోనే రైతులకు ఆ డబ్బు అందుతుందని భావిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 01:11 AM