అక్షరాస్యత వైపు అతివలు..
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:59 AM
అక్షరాలు నేర్వని అతివలకు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కూడికలు వంటి లెక్కలు నేర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- ‘స్వశకి’్తలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యం
- ‘ఉల్లాస్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలుకు ఏర్పాట్లు
- సెర్ఫ్, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహణ
- జిల్లాలో 21,894 మంది మహిళలు..
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అక్షరాలు నేర్వని అతివలకు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కూడికలు వంటి లెక్కలు నేర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సెర్ఫ్, విద్యాశాఖ సంయుక్తంగా ఉల్లాస్(అండర్ స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఆన్ సొసైటీ) పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దశలవారీగా అమలు చేసే ఉల్లాస్ కార్యక్రమంలో ముందుగా మహిళా స్వశక్తి సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెర్ప్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు.
జిల్లాలో 1.15 లక్షల మంది స్వశక్తి సభ్యులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10,008 స్వశక్తి సంఘాలు ఉండగా, 1.15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 21,894 మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గురించారు. ఇందులో బోయినపల్లిలో 2,422 మంది, చందుర్తిలో 1,294 మంది, ఇల్లంతకుంటలో 2,399మంది, గంభీరావుపేటలో 2,395మంది, కోనరావుపేటలో 2,372 మంది, ముస్తాబాద్‌లో 2,354 మంది, రుద్రంగిలో 1,274 మంది, తంగళ్ళపల్లిలో 2,382 మంది, వీర్నపల్లిలో 1,294 మంది, వేములవాడలో 1,326 మంది, వేములవాడ రూరల్‌లో 1,096 మంది, ఎల్లారెడ్డిపేటలో 1,286 మంది నిరక్షరాస్య మహిళలున్నారు. ఇప్పటి వరకు 8,929 మంది మహిళలను ఉల్లాస్‌యాప్‌లో నమోదు చేశారు.
ఓపెన్ స్కూలింగ్ విధానం అమలు..
కేంద్ర ప్రభుత్వం అక్షరాస్యతను పెంచే దిశగా శ్రీకారం చుట్టిన ఉల్లాస్ కార్యక్రమం ఓపెన్ స్కూలింగ్ విధానంలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్ల కాలం కొనసాగించింది. తర్వాత 2020లో కొత్త విద్యా విధానం అమల్లోకి తెచ్చింది. 2022 నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. పదో తరగతిలో మానేసిన వారిని ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ బోధన అందిస్తారు. ఇప్పటివరకు పదో తరగతి విద్యను అందించడానికి 1,184 మంది, ఇంటర్మీడియట్ 722 మందిని గుర్తించారు. మహిళా సంఘాల్లో పూర్తిగా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పడానికి 1,229 మంది వలంటీర్లను కూడా గుర్తించారు. వీరిలో 628 మంది వలంటీర్ల వివరాలను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశారు. వీరితో పాటు ప్రతి జిల్లా నుంచి డీఆర్‌పీలుగా ముగ్గురు టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 31లోపు మండల గ్రామస్థాయిలో కూడా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరక్షరాస్యులకు ప్రతిరోజు రెండు గంటల చొప్పున బోధన అందిస్తారు. తరగతుల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉల్లాస్‌యాప్‌లో నమోదైన స్వశక్తి సంఘాల్లోని సభ్యులు
మండలం నిరక్షరాస్యులు పదోతరగతి ఇంటర్మీడియట్
బోయినపల్లి 599 13 10
చందుర్తి 673 31 47
ఇల్లంతకుంట 191 60 30
గంభీరావుపేట 598 166 209
కొనరావుపేట 1,003 329 272
ముస్తాబాద్ 503 20 00
తంగళ్లపల్లి 468 16 02
రుద్రంగి 2,383 72 46
తంగళ్ళపల్లి 238 17 00
వీర్నపల్లి 511 25 08
వేములవాడ రూరల్ 529 08 05
ఎల్లారెడ్డిపేట్ 1,233 427 101
-----------------------------------------------------------------------------------
మొత్తం 8,929 1,184 722
-----------------------------------------------------------------------------------
Updated Date - Jul 26 , 2025 | 12:59 AM