ప్రోత్సాహానికి తప్పని ఎదురుచూపులు
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:12 AM
ఆదర్శ వివాహాలను చేసుకున్న దంపతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహం అందడంలో జాప్యం జరుగుతోంది.
జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ వివాహాలను చేసుకున్న దంపతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహం అందడంలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహ సొమ్ము కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో ఆదర్శ వివాహాలకు ఆదరణ కరువు అవుతోంది. కులాంతర పెళ్లిళ్లు చేసుకుంటే ప్రోత్సాహకాలు అందిస్తామన్న ప్రభుత్వం నుంచి ఆ నిధులు విడుదల కావడం లేదు. షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయి ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇది వరకు రూ. 50 వేలు ఉన్న ఆర్థికసాయాన్ని గత ప్రభుత్వం 2019 నవంబరులో రూ. 2.50 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆదర్శ దంపతులకు సంబంధించిన ప్రోత్సాహకాలకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయడంలేదు. వివాహం చేసుకున్న జంటలకు ఆర్థికసాయం సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు.
253 దరఖాస్తులు...
జిల్లాలో ఆదర్శ వివాహాలు చేసుకున్న 253 జంటలు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీరిలో 68 జంటలకే సాయం అందింది. ఇంకా 185 జంటల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారికి ఆర్థికసాయం అందాల్సి ఉంది. గతంలో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం పెంచినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులకు నిరాశే ఎదురవుతోంది. కుల ప్రాతిపదికన సమాజంలో అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి నిధుల కొరత ఇబ్బందులు కలిగిస్తోంది.
అర్హులు వీరే...
ఆదర్శ కులాంతర వివాహం చేసుకున్నవారు ఆర్థిక సాయం పొందాలంటే పలు అర్హతలు కలిగి ఉండాలి. దంపతుల్లో ఒకరు తప్పకుండా షెడ్యూల్ కులానికి చెందిన వారై ఉండాలి. మరొకరు ఇతర కులానికి చెందినవారై ఉండాలి. అమ్మాయికి 18 ఏళ్లు కచ్చితంగా నిండి ఉండాలి. వివాహ చట్టం ప్రకారం రిజిష్టర్ అయి ఉండాలి. పెళ్లయిన జంట వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. మొదటి వివాహానికి మాత్రమే ప్రోత్సాహకం అందుతుంది. వివాహమైన ఏడాదిలోపు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందుతుంది.
ఫ అవసరమైన ధ్రువీకరణ పత్రాలు...
వేర్వేరు కులానికి చెందిన యువతీ యువకులు పెళ్లికి సంబంధించిన ఆధారాలతో షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత శాఖ అధికారులు విచారణ చేసి అర్హులని తేలితే ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. వివాహం చేసుకున్న దంపతులు మూడు ఫొటోలు, కులం, వయసు ధ్రువీకరణ పత్రాలు విద్యాసంస్థల నుంచి తీసుకున్న టీసీ, మార్కుల జాబితా, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారుల నుంచి పొందిన ఫస్ట్ మ్యారెజ్ సర్టిఫికెట్, దంపతులు కలిసి తీసిన బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలి. వివాహానికి సాక్షుల వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ఎక్కువ, నిధులు తక్కువ....
జిల్లాలో కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులు ప్రభుత్వ సాయం కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకోగా, నిధులు తక్కువగా విడుదల చేయడం వల్ల అర్హులందరికీ అందడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా లక్ష నూటపదహారు రూపాయల ను అందించడంతో కులాలు వేరైనా పెద్దలు ఒప్పుకుని పెళ్లి చేసుకున్న జంట లకు కల్యాణలక్ష్మి వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు పెళ్లిళ్లు చేసుకున్న రోజుల నుంచి క్రమంగా మార్పులు చోటుచేసుకొని కులాలు, మతాలు వేరైనా ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పలు కులాల్లో అమ్మాయిల నిష్పత్తి తక్కువగా ఉండడంతో పలువురు అబ్బాయిలకు పెద్దలు సైతం కులాంతర వివాహాలు జరిపిస్తున్నారు. మరికొం త మంది అబ్బాయిలు ఆదర్శ వివాహాలు జరుపుకుంటున్నారు.
నిధులు రాగానే సహాయం అందిస్తాం
- రాజు కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి
ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని రూ. 2.50 లక్షలకు పెంచింది. జిల్లాలో దరఖా స్తులు ఎక్కువగా వచ్చాయి. బడ్జెట్ మేరకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అర్హులైన జంటలు జీవితంలో స్థిరపడేలా కృషి చేస్తున్నాం.
Updated Date - Jul 18 , 2025 | 01:12 AM