సైన్యానికి, మోదీకి మద్దతుగా ఏక్తా యాత్ర
ABN, Publish Date - May 23 , 2025 | 01:19 AM
సైన్యానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సైన్యానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపి భారత సైన్యానికి బాసటగా నిలవండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని, తల్లి ముందు కొడుకును ఉగ్రవాదులు పహల్గాంలో దారుణంగా కాల్చి చంపారని, అందుకే పాకిస్తాన్‌పై భారత సైన్యం దాడి చేసి సత్తా చూపిందని అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా నరేంద్ర మోదీకి మద్దతుగా హిందూ ఏక్తా యాత్ర ర్యాలీని కొనసాగిద్దామని ఆయన ప్రజలను కోరారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళా సైనికులు చూపిన వీరోచిత పోరాటాలను ఆయన అభినందించారు. హిందు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కుహనా లౌకికవాదులకు వార్నింగ్ ఇవ్వడానికే హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. మతం పేరు అడిగి బట్టలిప్పి హిందువని తెలిశాకే కాల్చి చంపారు, దానికి నరేంద్ర మోదీ ఏం చేశారో చూశారుకదా.. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ ఉగ్రవాదులకు నా అన్నవారు లేకుండా చేశారన్నారు. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై ఆల్‌ఖైదా దాడి చేసి ఆరు వేల మందిని చంపితే పదేళ్ల తర్వాతే ఒసామా బిన్‌లాడెన్‌ను పట్టుకుని చంపారని, పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదుల అంతుచూసిన ఘనత భారత సైన్యానిదనిన ప్రశంసించారు. పాకిస్థాన్‌పై చేసిన యుద్ధాన్ని చిన్నది అని అంటూ తక్కువ చేసి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను సవాల్ చేస్తున్నా.. పాకిస్తాన్ లోపలకు వెళ్లి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా.. ఆ దేశ మిలిటరీ మౌలిక వసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని సంజయ్ ప్రశ్నించారు. యుద్ధంలో మన రాఫెల్ విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయో లెక్క చెప్పాలని రాహుల్ గాంధీ మాట్లాడడం సిగ్గుచేటని, మన సైన్యం శౌర్య పరాక్రమాలను పొగడాల్సిందిపోయి తక్కువచేసి చూపుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో యుద్ధం జరిగినప్పుడు పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను ఏరివేస్తుంటే మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించి సబ్సిడీలు ఇచ్చింది నిజం కాదా అని అన్నారు.
మీ ఉత్సాహం.. నాకు బలం
హిందూ ఏక్తా యాత్రకు వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా వచ్చిన ప్రజలకు ఆయన సంజయ్ అభినందనలు తెలిపారు. మీ ఉత్సాహాన్ని, ఆవేశాన్ని చూస్తుంటే నాకు నాలో రక్తం ఉరకలేస్తుందని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు. గతంలో కరీంనగర్‌లో ఏక్తా యాత్రలు నిర్వహిస్తే హిందూ పిచ్చోడని హేళన చేశారని, ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్ఛిన్నం చేయాలని చూశారని అన్నారు. హిందూ ఏక్తా యాత్ర చేస్తుంటే తనకు గుండె పోటు వచ్చిందని, స్పృహ కోల్పోయే ముందు నాకు మళ్లీ ఆయష్షు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. అమ్మవారు తనను కరుణించి మళ్లీ పునర్జన్మ ఇచ్చిందని, ఈ జీవితమంతా కాషాయ జెండా, సనాతన ధర్మం కోసమే పనిచేస్తానని సంజయ్ అన్నారు. యాత్రను ప్రారంభిస్తూ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామిజీ, సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ప్రసంగించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా హునుమాన్ దీక్షాపరులు, బీజేపీ, దాని అనుబంధ సంఘాల శ్రేణులు, వివిధ ధార్మిక, కుల, వృత్తి సంఘాలకు చెందినవారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి, ఉమ్మడి జిల్లా పరిధి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణలు, కళా ప్రదర్శనలతో భక్తి, దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ర్యాలీలో పాల్గొన్నవారు ముందుకు సాగారు. గాంధీ రోడ్‌లోని వైశ్య భవన్ నుంచి టవర్‌సర్కిల్, కమాన్ రోడ్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్ మీదుగా తిరిగి వైశ్యభవన్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
కరీంనగర్ అర్బన్: హిందూ ఏక్తా యాత్రలో హిందు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ దేవతామూర్తుల బొమ్మలను వాహనాలపై ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలతో యాత్ర ముందు భాగంలో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. రాజీవ్ చౌక్‌లో హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను ముస్లింలు గజమాలతో సన్మానించి, స్వాగతం పలుకుతూ గులాబీలను యాత్రలో పాల్గొన్న భక్తులపై చల్లారు. యాత్ర పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు భక్తులకు మజ్జిగ, తాగునీరు, ప్రసాదాలను అందించారు.
పటిష్ట బందోబస్తు....
కరీంనగర్ క్రైం: హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో గురువారం నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏక్తాయాత్ర సాగే మార్గంలో పెద్ద సంఖ్యలో సాయుధ, మఫ్టీలో పోలీసులను మోహరించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. నగరమంతటా పెట్రోలింగ్ నిర్వహించారు. హిందూ ఏక్తా యాత్ర ర్యాలీకి బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి గురువారం సీపీ బ్రీఫింగ్ చేశారు. సున్నితమై ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్‌టాప్ నిఘా, మొబైల్ పెట్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని మార్గాలలో దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. హిందూ ఏక్తా యాత్ర బందోబస్తును గురువారం రాత్రి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కమాండ్ కంట్రోల్ బస్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ద్వారా పర్యవేక్షించారు. ర్యాలీ మార్గంలో సీపీ తిరుగుతూ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. హిందూ ఏక్తాయాత్ర శోభాయాత్ర సందర్భంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 01:19 AM