ఆశావహుల్లో సందిగ్ధం
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:15 AM
హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల పండుగపై క్లారిటీ వచ్చింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల పండుగపై క్లారిటీ వచ్చింది. మరో మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే విధంగా హైకోర్టు తీర్పునివ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక ఎన్నికలపై ప్రధాన పార్టీల్లో కదలిక మొదలైంది. ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ఆశావహుల్లో మాత్రం స్థానిక ఎన్నికల్లో పంచాయతీ, పరిషత్‌లకు సంబంధించి ఏ ఎన్నికలను ముందు నిర్వహిస్తారనే సందిగ్ధం ఏర్పడింది. గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లితే పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహించే విధంగా సన్నాహాలు మొదలుపెట్టింది. అధికారులు, సిబ్బందికి ఎన్నికలపై శిక్షణ కూడా ఇచ్చారు. బ్యాలెట్ పేపర్లు, ఓటర్ జాబితాలను సిద్ధం చేశారు. కానీ కులగణన ప్రక్రియతో నిలిచిపోయింది. గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి 18 నెలలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసి సంవత్సరం గడిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏ ఎన్నికల వైపు ముందడుగు వేస్తుందనే దానిపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది.
ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, జడ్పీటీసీలు ఎంపీటీసీల ఎన్నికల్లో దేనికి ముందు నోటిఫికేషన్ వచ్చినా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. గతంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలు, గుర్తులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సైతం సిద్ధం చేశారు. సిబ్బందిని గుర్తించి వివరాలు ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 260 సర్పంచులు, 2268 వార్డు సభ్యులు, 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 3,46,259 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది ఉన్నారు.
జిల్లాలో ప్రధాన పార్టీల దృష్టి..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకునే విధంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు దృష్టి పెట్టాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండడంతో స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం పెరగనుంది. వేములవాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికలు పోటాపోటీగానే ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఉండడంతో ఎక్కువ స్థానిక సీట్లు గెలుచుకోవాలని ఆరాటపడుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో విభిన్నమైన పరిస్థితులు ఉండడంతో ఫలితాలు ఏలా రాబోతాయనే ఆసక్తి గ్రామీణ ఓటర్లలో నెలకొంది.
జిల్లాలో పురుషులు, మహిళల ఓట్లు..
మండలం పురుషులు మహిళలు మొత్తం
బోయినపల్లి 14,681 15,595 30,276
చందుర్తి 13,220 14,394 27,614
ఇల్లంతకుంట 19,391 20,512 39,903
గంభీరావుపేట 17,543 18,639 36,183
కోనరావుపేట 16,795 17,666 34,461
ముస్తాబాద్ 18,529 19,613 38,142
రుద్రంగి 6,234 7,006 13,243
తంగళ్లపల్లి 18,372 19,432 37,804
వీర్నపల్లి 5,713 5,836 11,549
వేములవాడ 8,877 9,296 18,189
వేములవాడరూరల్ 8,914 9,699 18,613
ఎల్లారెడ్డిపేట 19,417 20,865 40,282
-------------------------------------------------------------------------------
మొత్తం 1,67,686 1,78,553 3,46,259(జెండర్ 20)
--------------------------------------------------------------------------------
Updated Date - Jun 27 , 2025 | 01:15 AM