రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:54 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
వేములవాడ కల్చరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించకున్నారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. రాజన్న దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఆలయంలోకి చేరుకున్న భక్తులు పార్వతిపరమేశ్వరులను దర్శించుకుని రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పరివార దేవతాలయాల్లో కుంకుమ పూజలో పాల్గొని అనుబంధ ఆలయాలను సందర్శించారు.
రాజన్న సేవలో ప్రముఖులు..
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని ఐపీఎస్ అధికారి నునావత్ ప్రవీణ్‌నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రాజన్న దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆయన వెంట వరంగ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి ఉన్నారు. అలాగే సినీ నటుడు ప్రణయ్ హనుమండ్ల రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచించి ప్రసాదాన్ని అందజేశారు.
Updated Date - Jun 23 , 2025 | 12:54 AM