బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్‌లో విధ్వంసం
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:20 AM
బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్‌లో అభివృద్ధి పేరిట తీవ్ర విధ్వంసం జరిగిందని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.
కరీంనగర్ అర్బన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్‌లో అభివృద్ధి పేరిట తీవ్ర విధ్వంసం జరిగిందని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ... అధికారం కోల్పోయిన బాధతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో కరీంనగర్‌లో 640 డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేయలేదన్నారు. రోడ్లనే తవ్వి మళ్లీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. కేబుల్ బ్రిడ్జి, జంక్షన్ల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో రెండు మూడేళ్లకే మరమ్మతులకు వచ్చాయని, కేబుల్ బ్రిడ్జిపై 6.5 కోట్లతో ఏర్పాటు చేసిన లైట్లు వెలగడమే లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అశాస్త్రీయత, నాణ్యత లోపంతో జరిగిన అన్ని పనులపై విజిలెన్స్ విచారణ జరుగుందని, బాధ్యులను వదలబెట్టబోమని హెచ్చరించారు.
టెండర్లు పిలువకుండానే ఆర్‌అండ్ బీ గెస్ట్‌హౌస్ నిర్మించారన్నారు. కరీంనగర్ నియోజక వర్గంలో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, కొన్ని సాంకేతిక కారణాలతో జాబితా ఆగిపోయిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందన్నారు. సుడా పరిధిలో జరుగుతున్న పనులు గంగుల కమలాకర్‌కు కనపడడంలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు ఇప్పుడు ఆగిపోయినట్టు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీనియర్ వైద్యుడైన మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అలాంటి వ్యక్తిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అసత్య, నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జర్నలిస్తులకు ఇళ్ల స్థలాల విషయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హడావుడిగా చేసిన చర్యల వల్ల ఈరోజు వారికి స్థలాల కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు.
త్వరలోనే వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. సీఎస్‌ఆర్ నిధుల నుంచి కేంద్రమంత్రి బండి సంజయ్ విద్యార్థులకు సైకిల్స్ ఇచ్చి అవి ఆయన సొంత డబ్బులతో ఇచ్చినట్లు మోదీ గిఫ్ట్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సైకిళ్లతో ర్యాలీ తీస్తుండగా ఒక విద్యార్థి సైకిల్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్, కొరివి అరుణ్‌కుమార్, బానోతు శ్రావణ్‌నాయక్, నాయకులు సర్దార్ ధన్నాసింగ్, కుర్రపోశయ్య, జొన్నల రమేష్, హస్తపురం రమేష్, రాజ్‌కుమార్, మాసం ఖాన్, గాలి అనిల్, సుదర్శన్ పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:15 PM