వేములవాడలో ముగిసిన కూల్చివేతలు
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:27 AM
వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన ఇళ్లు, భవనాల కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
వేములవాడ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన ఇళ్లు, భవనాల కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ముందు నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించే ప్రక్రియను అధికార యంత్రాంగం ఆదివారం ప్రారంభించగా, బుధవారం రాత్రికి కూల్చివేతలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరించే క్రమంలో 243 ఇళ్లను తొలగించాల్సి ఉండగా, ఇందులో 80 ఇళ్లకు సంబంధించిన యజమానులు కోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో వాటిని మినహాయించి మిగతా వాటిని అధికారులు కూల్చివేశారు. రోడ్ల వెడల్పు కోసం సేకరించాల్సిన స్థలం మేరకు మార్కింగ్ చేసి ప్రొక్లెయినర్లతో కూల్చివేశారు. మిగిలిపోయిన నిర్మాణం సైతం దెబ్బతినే అవకాశం ఉండడంతో కొందరు ఇంటి యజమానులు నష్టపోయే భాగాన్ని కూల్చివేసేందుకు తమకే అవకాశం ఇవ్వాలని కోరడంతో అధికారులు అందుకు అంగీకరించారు. పాక్షికంగా కోల్పోతున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలలో సంబంధిత యజమానులు కూలీల సహాయంతో తొలగింపు పనులు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు కూల్చివేత పూర్తయిన వాటికి సంబంధించిన శిథిలాలను తరలించాల్సి ఉండగా, అందుకు సంబంధిత నిర్మాణాల యజమానులకే అవకాశం ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. ఇందుకోసం నాలుగు రోజులు సమయం ఇస్తున్నామని, అప్పటిలోగా శిథిలాలు తరలించాలని లేనిపక్షంలో తామే శిథిలాలను తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - Jun 20 , 2025 | 12:27 AM