కొనుగోళ్లలో జాప్యం...
ABN, Publish Date - May 09 , 2025 | 12:57 AM
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా ఎండగా ఉండి సాయంత్రం ఈదురుగాలుల, వర్షం పడడంతో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోయిందని వాపోతున్నారు. యాసంగిలో వరి పండించడం కన్నా ధాన్యాన్ని అమ్ముకోవడానికే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు.
పేరుకుపోతున్న ధాన్యం...
- పట్టించుకోని అధికారులు
- ధాన్యం తరలింపులోనూ లారీల కొరత
- వాతావరణ మార్పులతో అన్నదాతల ఆందోళన
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా ఎండగా ఉండి సాయంత్రం ఈదురుగాలుల, వర్షం పడడంతో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోయిందని వాపోతున్నారు. యాసంగిలో వరి పండించడం కన్నా ధాన్యాన్ని అమ్ముకోవడానికే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు.
ఓదెల/పాలకుర్తి, మే 8 (ఆంధ్రజ్యోతి): ఓదెలతోపాటు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల కొరత రైతులను బాధిస్తోంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికీ నేటికి ఆశించిన మేరకు కొనుగోలు, రవాణా సక్రమంగా కొనసాగడం లేదు. కేంద్రాల నిర్వాహ కులు అధికారులకు, మిల్లర్లకు ఇక్కడి పరిస్థితిని ఫోన్‌లో తెలిపినా ఎలాం టి స్పందన రావడం లేదు. మండలంలోని 11 ఐకేపి కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం బుధవారం నాటికి 4105.20 క్వింటాళ్లు, అలాగే దొడ్డు రకం 3869.40 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అయినప్పటికీ మిల్లులకు ధాన్యం రవాణా లేకపోవడంతో ఎక్కడికక్కడే ధాన్యం నిల్వలు పేరుకుపో యాయి. అలాగే మరో 20 వేల క్వింటాళ్ల వరకు తూకం వేసినవి, వేయ నివి అలాగే ఉన్నాయి. మండల వ్యాప్తంగా వెయ్యి లారీలైతే గాని ధాన్యం మిల్లులకు చేరుకునే పరిస్థితి లేదు. సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత తీవ్రంగా ఉండడంతో ధాన్యం బస్తాల లోడింగ్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఐదు రోజుల క్రితం తూకం పూర్తయి లోడింగ్ కోసం వేచి ఉన్న బస్తాలు అలాగే మిగిలిపోయాయి. వాతావరణ మార్పు లతో వర్షాల భయం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక పక్క కేంద్రాల్లో పోసిన ధాన్యం తూకం వేయక, మరోపక్క వ్యవసాయ పనులకు రైతులు వెళ్ల లేక సతమతమయ్యే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తూకం పూర్తి చేయించి, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
పాలకుర్తి మండలంలో కన్నాల, బామ్లానాయక్ తండా, జీడినగర్, రాణాపూర్, ఎల్కలపల్లి, పాలకుర్తి, కొత్తపల్లి, బసంత్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకు 37,600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా 44,000 క్వింటాళ్ల ధాన్యం నిలువ ఉంది. అలాగే రామగుండం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలో జయ్యారం, గుడిపెల్లి, పుట్నూర్, ఈసాలతక్కళ్లపల్లి, కుక్కలగూడూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటిలో ఇప్పటి వరకు 26,600 ధాన్యం కొనుగోలు చేయగా మరో 24,600 క్వింటాళ్ల ధాన్యం నిలువలు పేరుకుపోయాయి.
కొనుగోళు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారు లు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి త్వరగా కొనుగోళ్ళు పూర్తి చేయాలని మండల రైతులు కోరుతున్నారు..
ఫ కంటి నిండ కునుకు ఉంటలేదు
- ఆసంశెట్టి రామయ్య , రైతు, ఓదెల
ఇక్కడి కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తూకం వేయడం లేదు. అడిగితే లారీలు లేవు అంటున్నారు. కొద్ది రోజుల్లో వ్యవసాయ పనులు మొదలవుతాయి. ఇటు వడ్లు అమ్ముడుపోక, అటు వర్షాల భయంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇట్లా ఎప్పుడు కాలేదు. వెంటనే అధికారులు లారీల సౌకర్యానికి కల్పించి ఆదుకోవాలె.
సన్న వడ్లు కొనడంలో జాప్యం
చింతల మురళి, రైతు జయ్యారం
సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలపడంతోపాటు అధిక మద్దతు ధర వస్తుందని ఆశతో అప్పులు చేసి 5 ఎకరాల 10 గుంటల్లో సన్న రకం వడ్లను పండించా. 15 రోజుల నుంచి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నా. పగలు ఎండ, రాత్రి వీస్తున్న ఈదురుగాలులు, కారుమబ్బులతో దిగులు పడుతున్నా. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి.
పొద్దంతా ఆరబెట్టుడే
శ్రీరాముల లింగగౌడ్ కౌలు రైతు గుడిపెల్లి
అప్పు చేసి 500 క్వింటాళ్ల సన్న ధాన్యం పండించా. 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. పగలు ఎండలకు ధాన్యాన్ని ఆరా పోస్తున్న. రాత్రి పూట వీస్తున్న ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులకు ఎప్పుడు వర్షం పడుతుందోననే ఆందోళన నెలకొంది. సన్న ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని దీంతో జాప్యం జరుగుతుందని కేంద్రం నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోళ్లు చేయాలి.
Updated Date - May 09 , 2025 | 12:57 AM