‘ఉపాధి’పై నిరంతర నిఘా..
ABN, Publish Date - May 16 , 2025 | 12:40 AM
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలకు బ్రేక్ పడేలా, మొక్కుబడి సామాజిక తనిఖీలకు స్వస్తి పలికే దిశగా నిరంతరం ఉపాధిపై నిఘా పెట్టే విధంగా చర్యలు మొదలయ్యాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలకు బ్రేక్ పడేలా, మొక్కుబడి సామాజిక తనిఖీలకు స్వస్తి పలికే దిశగా నిరంతరం ఉపాధిపై నిఘా పెట్టే విధంగా చర్యలు మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను పర్యవేక్షించేందుకు గ్రామ పంచాయతీల వారీగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సర్క్యులర్‌లు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీల్లో ఐదుగురు సభ్యులతో కూడిన వీఎంసీ కమిటీల ఏర్పాటు మొదలుపెట్టారు. నిఘా పర్యవేక్షణగా ఉండే కమిటీల్లో మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘం, స్వచ్ఛంద సంస్థ, ఉపాధి కూలీల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సభ్యులు రిసోర్స్‌పర్సన్‌లు, స్వచ్ఛంధ క్లబ్‌లలోని సభ్యులు కమిటీల్లో ఉంటారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కమిటీలు ఆరు నెలల పాటు పనిచేయనున్నాయి.
ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ..
ఉపాధిహామీ పనుల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షణ కమిటీలు చూసుకుంటాయి. ప్రతినెలా ఒకరోజు పంచాయతీ కార్యదర్శితో కలిసి ఉపాధిహామీ కూలీలు, సిబ్బందితో సమావేశం అవుతారు. పనుల నిర్వహణ, ఉపాధి రికార్డులు, పనుల్లో నాణ్యత, సౌకర్యాలు, ఖర్చులు, అంచనా వేసిన పనులపై నివేదికను రూపొందిస్తారు. సోషల్ ఆడిట్ సమయంలో కూడా నివేదికలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉపాధిహామీ పనులపై ప్రతీయేటా నిర్వహించే సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వసున్నా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మొక్కుబడిగా సాగే సామాజిక తనిఖీలకు స్వస్తి పలికే విధంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు పనిచేయనున్నాయి.
జిల్లాలో 1.99 లక్షల మంది ఉపాధి కూలీలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98,122 జాబ్ కార్డులు ఉండగా, 1,99,674 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఎస్సీ 52,701, ఎస్టీలు 13,385 మంది, ఇతరులు 1,31,588 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,01,264 మంది ఉన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల్లో మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఉపాధిహామీ పనిదినాలను ప్రభుత్వం ఇటీవల తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు 7రూపాయల కూలి పెంచుతూ ప్రస్తుతం ఉన్న రూ.300ను రూ.307కు పెంచింది. ఉపాధిహామీ పనులను మరింత పారదర్శకంగా కొనసాగే విధంగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీల హాజరులో జవాబుదారీతనం పెరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు నామమాత్రంగా పనులు జరగకుండా పర్యవేక్షణ కమిటీల ద్వారా నిఘా కొనసాగుతుంది.
Updated Date - May 16 , 2025 | 12:40 AM