అన్నదాతల్లో ఆందోళన
ABN, Publish Date - May 15 , 2025 | 12:42 AM
జిల్లాలో వాతావరణ పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. ఒకవైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతూ గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొద్దంతా తీవ్రమైన ఉక్కపోతతో ఇళ్లలోనే జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాత్రివేళల్లో పిడుగులు, గాలి దుమారంతో వడగండ్లు, అకాల వర్షంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు అకాల వర్షం రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడ్డారు.
- పొద్దంతా సూర్యప్రతాపం.. రాత్రి పిడుగులతో కూడిన వర్షం
- కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
- జిల్లాలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- యాసంగి దిగుబడి అంచనా 3.67 లక్షల మెట్రిక్ టన్నులు
- ఇప్పటివరకు కొనుగోలు 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో వాతావరణ పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. ఒకవైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతూ గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొద్దంతా తీవ్రమైన ఉక్కపోతతో ఇళ్లలోనే జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాత్రివేళల్లో పిడుగులు, గాలి దుమారంతో వడగండ్లు, అకాల వర్షంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు అకాల వర్షం రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ యథావిధిగా మధ్యాహ్నం వేళ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 41.3డిగ్రీల వరకు నమోదైంది. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సూర్యప్రతాపాన్ని తట్టుకోవడానికి ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. బుధవారం మధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో కోనరావుపేటలో 41.3 డిగ్రీలు, ఎల్లారెడ్డిపేటలో 40.4, ఇల్లంతకుంటలో 40.9, వేములవాడ రూరల్‌లో 40.7, రుద్రంగిలో 40.1, సిరిసిల్లలో 39.5, వేములవాడలో 39.3, డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గిపోయి అవస్థలు పడుతున్నారు. శీతల పానీయాలతో దాహం తీర్చుకుంటున్నారు. వివాహాలు, శుభకార్యాలు, వెళ్లడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. భగభగ మండుతూ నిప్పులు కురిపిస్తున్న తీరుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఫ అకాల వర్షం.. అన్నదాత దిగాలు
ఎన్నో అశలతో యాసంగి దిగుబడి వస్తుందని భావిస్తున్న రైతులను అకాల వర్షాలు దిగాలు పరుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన వారం రోజులుగా వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షాలు పిడుగులు, రైతులను ఆందోళనకు గురిచేశాయి. పిడుగులకు కోనరావుపేటలో ఎద్దు మృతిచెందగా, సిరిసిల్లలోని పెద్దూర్‌లో పశుగ్రాసం దగ్ధమైంది. తంగళ్లపల్లిలో గాలి దుమారానికి షెడ్లు కొట్టుకుపోయాయి. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టుకోవడంలో అవస్థలు పడ్డారు. జిల్లాలోని రుద్రంగిలో 17.3 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 15.8, వీర్నపల్లిలో 13.8, సిరిసిల్లలో 13.5, వేములవాడలో 12.8, తంగళ్లపల్లిలో 9.3, వేములవాడ రూరల్‌లో 8.0, ముస్తాబాద్‌లో 6.3, చందుర్తిలో 5.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట, మండలాల్లో 3 నుంచి 1.0 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
ఫ 12 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి...
యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటా పెట్టకపోవడం, కాంటా వేసిన ధాన్యం తరలించకపోవడం అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తుత్తున్న తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 3.67 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనాలు వేశారు. ఇప్పటివరకు 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. జిల్లాలో 244 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ద్వారా 194 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 45 కేంద్రాలు, డీసీఎంఎస్ ఒకటి, మెప్మా 7 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 12 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసి మూసివేశారు. జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో 2.92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డురకం, 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకం వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో పౌర సరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు లక్ష 69 వేల 618 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 1,30,863 మెట్రిక్ టన్నులు, సింగిల్‌విండోల ద్వారా 32,976 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1,644 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 4,134 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం లక్షా 66 వేల 333 మెట్రిక్ టన్నులు, సన్నరకం 3,284 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 1,62,710 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రాల నుంచి తరలించారు. 24,294 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 1,69,618 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 15,831 మంది రైతులకు సంబంధించి 1,02,845 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఆన్‌లైన్ చేశారు. ఇప్పటివరకు 10,894 రైతుల ఖాతాల్లో 72,610 మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు రూ.168.46 కోట్లు జమ చేశారు.
రోడ్డెక్కుతున్న రైతులు..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించాలని రైతులు ఏదో ఒకచోట ఆందోళనలు చేపడుతున్నారు. కలెక్టరేట్ వరకు కూడా తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, రుద్రంగి, ఇల్లంతకుంట వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి తదితర మండలాల్లో రైతుల ఆందోళనలు చేస్తున్నారు.
Updated Date - May 15 , 2025 | 12:42 AM