కవిత పాత్రధారిగా చార్‌పత్తా సినిమా
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:07 AM
కల్వకుంట్ల కవిత పాత్రధారిగా చార్‌పత్తా సినిమా నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్, మే 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కల్వకుంట్ల కవిత పాత్రధారిగా చార్‌పత్తా సినిమా నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కవిత ఎపిసోడ్‌తో ప్రజలకు ఏమి మేలు జరుగుతుందని ప్రశ్నించారు. చిట్‌చాట్‌ల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై త్వరలో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని అడ్డుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ అంటేనే అవినీతి పార్టీ అని, కవితను అరెస్టు చేయకుండా ఉండడానికి బీజేపీతో కలవడానికి బీఆర్‌ఎస్ ప్రయత్నించిందన్నారు. కుటుంబ పార్టీని తాము దగ్గరకు రానివ్వలేదని తెలిపారు. పంటలకు మద్ధతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీకి తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫాంహౌజ్, ఫార్ములా ఈ కార్ రేసు కేసుల విషయంలో బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. వేములవాడ రాజన్న ఆలయం పరిధిలో 18 ఆవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహమే అన్నారు. భారత సైన్యం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాఫెల్ యుద్ద విమానాలను వినియోగించిందని, భారతసైన్యం వాటిని విమర్శించడమంటే సైన్యంపై కాంగ్రెస్‌కు నమ్మకం లేనట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఆర్మీ ఛీప్‌పై విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. ఎమైనా అంటే ఇంధిరగాంఽధీని ప్రస్తావిస్తారని, ఆమె హయాంలో యుద్ధం జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేక పోయారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్, హరీష్‌రావు భేటీ విషయం తనకు తెలియదన్నారు. కాంగ్రెస్, బబీఆర్‌ఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయని, వాళ్లెన్ని కుట్రలు చేసినా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరన్నారు.
ఫ అభివృద్ధికి పెద్ద పీట
గంగాధర: కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గంగాధరలో 2.63 కోట్లతో 23 గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, సింగిల్ విండో అధ్యక్షుడు తిరుమల్‌రావు, ఎంపీడీవో రాము, బీజేపీ నాయకులు వైద రామానుజం, పంజాల ప్రశాంత్, పెరుక శ్రవన్‌కుమార్, నర్సింహారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:07 AM