చిగురిస్తున్న ఆశలు
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:33 AM
గర్షకుర్తిలో మరమగ్గాల చప్పుళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం స్వశక్తి చీరల తయారీకి ఆర్డర్లు జారీ చేసి నేత కార్మికులకు భరోసా కల్పించింది.
గంగాధర, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గర్షకుర్తిలో మరమగ్గాల చప్పుళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం స్వశక్తి చీరల తయారీకి ఆర్డర్లు జారీ చేసి నేత కార్మికులకు భరోసా కల్పించింది. గంగాధర మండలం గర్షకుర్తిలో మరమగ్గాలకు పెట్టింది పేరు. ఇక్కడ 14 వందల మగ్గాలుండగా రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు. సంవత్సర కాలంగా కార్మికులు ఉపాధి లేక, మరో పని చేయలేక ఇంటి పట్టునే ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి మహిళలకు చీరలను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గర్షకుర్తికి 28 లక్షల మీటర్ల గుడ్డ ఆర్డర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఆర్డర్లతో గ్రామంలోని మగ్గాల కార్మికులకు మూడు నెలలపాటు చేతినిండా పని ఉంటుంది. ప్రస్తుతం చేపట్టనున్న చీరల తయారికి కార్మికుడికి తగిన ప్రతిఫలం అందించాలని కోరుతున్నారు. గతంలో తయారు చేసిన చీరలతో పోల్చితే శ్రమతో కూడుకున్నదని అంటున్నారు. చీర తయారు చేసే క్రమంలో పోగులు తెగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పోగు తెగితే అంటించడానికి సమయం పడుతుంది. దీంతో ఉత్పత్తి తగ్గి కార్మికుడికి కూలి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. గతంలో కార్మికుడికి రోజుకు ఆరు వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు కూలి పడేది. ప్రస్తుతం పనికి తగ్గ ప్రతిఫలం అందించాలని గర్షకుర్తి కార్మికులు కోరుతున్నారు.
నేడు ప్రభుత్వానికి మోడల్ చీర అందజేత
రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాల సభ్యులకు అందించనున్న చీరను గర్షకుర్తిలో తయారు చేసిన మోడల్‌ను శుక్రవారం ప్రభుత్వానికి అందజేయనున్నారు. గతంలో టెక్సో ఉండగా ప్రస్తుతం టెక్సో, కాటన్ మిక్సింగ్‌తో తొమ్మిది గజాల చీరను అందించడానికి ప్రభుత్వం అర్డర్లు ఇచ్చింది. దీని ప్రకారం గర్షకుర్తిలో యాజమానులు మోడల్ చీరను సిద్ధం చేశారు. శుక్రవారం మోడల్ చీరను టెక్స్‌టైల్ కార్పొరేషన్ కమిషనర్‌కు అందించనున్నారు. ఈ చీరకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వారంలో పని ప్రారంభమవుతుంది.
పనికి తగ్గ ప్రతిఫలం అందించాలి
- అలువాల తిరుపతి, గర్షకుర్తి
కార్మికులు మగ్గాలే లోకంగా జీవిస్తున్నారు. స్వశక్తి చీరల తయారీలో పనికి తగ్గ ప్రతిఫలం అందించాలని కోరుతున్నారు. కాటన్, టెక్సోతో చీరలు తయారు చేయాల్సి ఉంటుంది. ఇది రిస్క్‌తో కూడినది. పోగులు తెగితే అతికించేందుకు ఒక్కోసారి మూడు రోజులు పట్టవచ్చు. అధికారులు కార్మికులకు పనికి తగ్గ ప్రతిఫలం అందించాలి.
Updated Date - Jul 04 , 2025 | 12:33 AM