పెద్దపల్లి ఆర్‌వోబీ వద్ద విరిగిన క్లస్టర్
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:58 AM
పెద్దపల్లి రైల్వే జంక్షన్ సమీపంలో కూనారం రోడ్డులో నిర్మిస్తున్న ఆర్‌వోబీ దగ్గర క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో ఖాజీపేట-బల్లార్షా రూట్‌లో ఆయా రైల్వేస్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోగా, కొన్ని రైళ్లను కొన్ని స్టేషన్ల వరకే పరిమితం చేశారు.
- ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం
- ఆయా స్టేషన్లలో నిలిచిన రైళ్లు.. పలు రైళ్లు పాక్షికంగా రద్దు
- పునరుద్ధరణతో ఆలస్యంగా నడిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్
పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వే జంక్షన్ సమీపంలో కూనారం రోడ్డులో నిర్మిస్తున్న ఆర్‌వోబీ దగ్గర క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో ఖాజీపేట-బల్లార్షా రూట్‌లో ఆయా రైల్వేస్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచి పోగా, కొన్ని రైళ్లను కొన్ని స్టేషన్ల వరకే పరిమితం చేశారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కూనారం వెళ్లే దారిలో ఆర్‌వోబీ నిర్మాణాన్ని చేపట్టారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కొత్త టెక్నాలజీతో ఐరన్ చేసిన ఆర్చీ నమూనా గల వాటిని పిల్లర్ల మీదకు యంత్రాల సహాయంతో తీసుకువచ్చి అమరుస్తున్నారు. అందులో భాగంగా రెండో లైన్‌లో రైల్వే ట్రాక్ మీదుగా ఐరన్ గడ్డర్లను అమర్చి దాని మీదుగా వంతెన శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి అమర్చే పనిని ప్రారంభించారు. ఒక క్లస్టర్‌లో గడ్డర్ లోడ్‌కు సగానికి పైగా విరగడాన్ని గమనించిన ఇంజనీరింగ్ అధికారులు వెంటనే లైన్ గుండా రైళ్ల రాకపోకలను నిలిపివేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే మరమ్మతు పనులను చేపట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎక్కడికక్కడే రైళ్లను నిలిపివేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ స్టేషన్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు రైళ్లు, గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు మరమ్మతులు అయ్యేందుకు సమయం పడుతుందని తెలుసుకుని బస్సుల్లో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. ఉదయం 11:50 గంటలకు మరమ్మతు పనులు పూర్తి కావడంతో రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు.
- రైళ్ల రాకపోకలకు అంతరాయం..
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో జరుగుతున్న ఆర్‌వోబీ పనుల వల్ల క్లస్టర్ విరిగి పోయి గడ్డర్లు కుంగడంతో ఖాజీపేట- బల్లార్షా లైన్‌లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంటర్ సిటీ, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగిరి, సింగరేణి మెమో ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు యథాతథంగా నడిచాయి. సికింద్రాబాద్ నుంచి నాగపూర్‌కు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బదులు మూడు గంటల ఆలస్యంగా సాయంత్రం నాలుగు గంటలకు బయలు దేరింది. అలాగే రైలు నంబర్ 17011/12 హైదరాబాదు నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు అక్కడి నుంచి బీదర్ వరకు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పోత్కపల్లి వరకే నడిపించారు. రైలు నంబర్ 12757/58 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్‌కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ కాగజ్‌నగర్ వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును పాక్షికంగా ఇరువైపులా రద్దు చేశారు. ఈ రైలును కేవలం కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్యే నడిపించారు. రైలు నంబర్ 17033 భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా వైపు వెళ్లే సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ రైలును వరంగల్ నుంచి బల్లార్షా మధ్య పాక్షికంగా రద్దు చేశారు, 17034సింగరేణి రైలు వరంగల్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నడిపించారు. రైలు నంబర్ 17003 కాజీపేట నుంచి సిర్పూర్ వైపు వెళ్లే మెమో ఎక్స్‌ప్రెస్ రైలును పొత్కపల్లి వరకే నడిపించి పోత్కపల్లి నుంచి సిర్పూర్ టౌన్ వరకు పాక్షికంగా రద్దు చేశారు. బోధన్ నుంచి సిర్పూర్ టౌన్‌కు అక్కడి నుంచి బోధన్‌కు నడిచే పుష్ పుల్ రైలును పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే రైలు నంబర్ 17234 భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును పాక్షికంగా కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు. ఇదే రైలు 17202 గుంటూరు వైపు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌గా కాజీపేట నుంచి నడిపించారు.
Updated Date - Jun 28 , 2025 | 12:58 AM