భానుడు ప్రతాపానికి భగ్గుమంటున్నాయి..
ABN, Publish Date - May 14 , 2025 | 12:41 AM
భానుడి భగ భగలకు మనుషులు, జంతువులు, పక్షులు వాహనాలు, యంత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మద్యాహ్నం ఎండ, వడ గాలులలు తీవ్రస్థాయికి చేరుకుంటుండంతో ప్రజలు పగటి వేళ ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు.
కరీంనగర్ క్రైం, మే 13 (ఆంధ్రజ్యోతి): భానుడి భగ భగలకు మనుషులు, జంతువులు, పక్షులు వాహనాలు, యంత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మద్యాహ్నం ఎండ, వడ గాలులలు తీవ్రస్థాయికి చేరుకుంటుండంతో ప్రజలు పగటి వేళ ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. రాత్రి 8 గంటల వరకు వేడిగాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గడిచిన 15 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువై జిల్లా అంతటా పగటిపూట నిప్పుల కొలిమిలా మారింది.
ఫ వాహనాల్లో మంటలు
ఎండ తీవ్రతతో వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. గంగాధర మండలంలో సోమవారం రాత్రి ఒక కారుకు మంటలు అంటుకోగా అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. లక్షల రూపాయల కారు పూర్తిగా దగ్ధమైంది. చొప్పదండి మండలంలో ఒక వరికోత యంత్రం మంటలు అంటుకుని దగ్ధమైంది. ఎండుగడ్డి, చెత్త, చెట్లు అంటుకుని అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన డంపు యార్డులో నిత్యం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. డంపుయార్డులో మంటలను శాశ్వతంగా నివారించే చర్యలు చేపట్టకపోవడంతో డంపుయార్డు నుంచి కాలుష్యకారకమైన పొగతో కోతిరాంపూర్, కట్టరాంపూర్, ఆటోనగర్, లక్ష్మినగర్, రాఘవేంద్రనగర్, అలకాపురికాలని, గౌతమినగర్ తదితర కాలనీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఫ ప్రజలకు వడదెబ్బ
జిల్లాలో ఎండలత కారణంగా అస్వస్థతకు గురై వడదెబ్బతో తిమ్మాపూర్ మండలం, చొప్పదండి మండలంలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గుర్తుతెలియని వృద్ధులు మృతిచెందారు. ఎండల కారణంగా కూలీలు, కార్మికులు ఉదయం 6 గంటల నుంచే పనులకు వెళుతూ 11 గంటల వరకు పనిపూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉపాధిహామీ పథకం కింద పనులకు వెళ్లేవారు కూడా 11 గంటల వరకే ఇళ్లకు చేరుకుంటున్నారు. శువులు, జంతువులు, పక్షుల పరిస్థితి దారుణంగా ఉంది. డీర్ పార్క్‌లో పక్షులు, జంతువుల షెడ్లను రోజుకు మూడు సార్లు నీటితో తడుపుతున్నారు. రైతులు తమ పశువులను ఎండ తీవ్రత నుంచి రక్షించేందుకు ఇళ్ల వద్ద, చెట్లకింద ఉంచుతున్నారు. జిల్లాలో రెండున్నర నెలల్లో 119 అగ్నిప్రమాదాలు జరిగి 86.3 లక్షల విలువైన ఆస్తులు దగ్ధమయ్యాయి. మరో 4.79 కోట్ల ఆస్తులను అగ్నిమాపక శాఖ రక్షించింది.
ఫ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
ప్రస్తుత వేసవి కాలంలో వాహనాల్లో ప్రయాణించాలంటే అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రతలతో వాహనాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించాలి. మండుతున్న ఎండలకు వాహనాల్లో ఇంజిన్, విద్యుత్ సరఫరా చేసే వైర్ల నాణ్యతలోపం కారణంగా మంటలు చెలరేగే అవకాశం ఉంది. వేగంగా వెళ్తున్న సమయంలో, ఇతర వాహనాలను ఢీకొన్న సమయంలో పెట్రోల్, డీజిల్ లీకేజి అయి మంటలు అంటుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నడుస్తున్న వాహనం, నిలిపి ఉన్న వాహనాల నుంచే అకస్మాత్తుగా మంటలు వచ్చి తగలబడిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఆపద ముంచుకు వస్తుందో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో పగటి పూట ప్రయాణాలు చేయడానికి ప్రజలు సంశయిస్తున్నారు. వాహనాల్లోని వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కటం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజి కారణంగా మంటలు అంటుకునే ప్రమాదముందని, ఎండ దెబ్బ నుంచి వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ మార్చి నుంచి జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలు...
---------------------------------------------------------------------------------------------------------------
నెల ప్రమాదాలు ఆస్థినష్టం కాపాడిన ఆస్థి ప్రాణనష్టం ప్రాణాల రక్షణ
---------------------------------------------------------------------------------------------------------------
మార్చి 31 33,41,000 1,23,69,000 2 1
ఏప్రిల్ 44 29,79,000 1,73,50,000 1 1
మే(12 వరకు) 44 23,10,000 1,22,60,000 0 0
---------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 119 86,30,000 4,79,79,000 3 2
-----------------------------------------------------------------------------------
Updated Date - May 14 , 2025 | 12:41 AM