స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:35 AM
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులతో కరీంనగర్‌లో అంతర్గత సమావేశం సోమవారం నిర్వహించారు.
భగత్‌నగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులతో కరీంనగర్‌లో అంతర్గత సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రభావం ఎంత ముఖ్యమో, అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలన్నారు. మిగిలిన వారంతా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందామన్న కసితో పని చేస్తున్నానన్నారు. మండలాధ్యక్షులు తమ మండలాల పరిధిలో అత్యధిక సర్పంచ్, వార్డు కౌన్సిలర్ స్థానాలను గెలిపించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని ఎన్నికల రంగంలోకి దిగాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రచారం చేయాలని సూచించారు. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చింది? అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులివ్వకుండా ద్రోహం చేసిందనే విషయంతోపాటు 19 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో పంచాయతీలకు ఇచ్చిన నిధులను ప్రజకు వివరించాలని సూచించారు.. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లుసహా స్మశాన వాటికల నిర్మాణం దాకా కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ పార్లమెంట్ ఇన్‌చార్జి బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:35 AM