రూ. 2.99 లక్షల కోట్లతో అమృత్-2
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:01 AM
అమృత్-2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే ప్రజలకు మంచి నీరు అందించేందుకు 2.99 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద 36.3 కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్‌మెంట్ స్కీంకు ఆయన శంకుస్థాపన చేశారు.
- ఇంటింటికి మంచి నీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
చొప్పదండి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): అమృత్-2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే ప్రజలకు మంచి నీరు అందించేందుకు 2.99 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద 36.3 కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్‌మెంట్ స్కీంకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రతి ఇంటికీ సరిపడా నీటిని అందించే లక్ష్యంతో పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. చొప్పదండి మున్సిపాలిటీలో అమృత్-2 పథకం కింద 36.3 కోట్ల రూపాయల నిధులతో పైపులైన్, వాటర్ పంపు, ఇతర పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చొప్పదండిలో ఈ స్కీం ఎప్పుడో ప్రారంభించాల్సి ఉండగా గత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల జాప్యం జరిగిందన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి పథకం పనులకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తిచేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమృత్ నిధులు రావడంతో కరీంనగర్ పార్లమెంట్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం కలిగిందన్నారు. సీఆర్‌ఐఎఫ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రోడ్లను నిర్మిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్-1 పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.34 కోట్ల నీటి కనెక్షన్లను, 1.02 కోట్ల మురుగు నీటి కనెక్షన్లను అందించామని అన్నారు. 2,411 పార్కులను అభివృద్ధి చేశామని, 62.78 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అమృత్-1, 2 కింద మొత్తం 6,876 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఇందులో కేంద్రం వాటా 3,591.72 కోట్లని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అమృత్-1, అమృత్-2 కింద మొత్తం 852.11 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర వాటాగా 481.19 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297.55 కోట్లు, మున్సిపాలిటీల వాటా 73.37 కోట్లు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 01:01 AM