Kaleshwaram Project: డీపీఆర్‌కు రూ.677 కోట్లా?
ABN, Publish Date - Feb 28 , 2025 | 03:25 AM
బ్యారేజీ డీపీఆర్‌ల తయారీకే వ్యాప్కో్‌సకి రూ.677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరంపై విచారణకు వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పని చేసిన ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది.
లెక్కలన్నీ ఉన్నాయి.. అబద్ధాలు చెప్పొద్దు
జలసంఘం లేఖలను దాచిపెట్టారా? లేదా?
మాజీ అధికారులపై ఘోష్ కమిషన్ ఫైర్
జ్ఞాపకశక్తి తగ్గిందన్న మాజీ ఈఎన్సీ మురళీధర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బ్యారేజీ డీపీఆర్‌ల తయారీకే వ్యాప్కో్‌సకి రూ.677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరంపై విచారణకు వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పని చేసిన ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది. కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఇచ్చామని రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గరున్నాయని, అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ గురువారం నీటి పారుదల శాఖలోని మాజీ ఈఎన్‌సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఈఎన్‌సీ బి.హరిరామ్‌లను మరోసారి ప్రశ్నించింది. గతంలో ప్రశ్నించినపుడు పలు అంశాలపై వీరు తమను తప్పుదోవ పట్టించారని కమిషన్ గుర్తించింది. అవే అంశాలకు సంబంధించి వాస్తవిక పత్రాలు పక్కన పెట్టుకొని మరోసారి ప్రశ్నలు అడిగింది. వ్యాప్కో్‌సకి డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని మురళీధర్ చెప్పగా, ప్రభుత్వం అంటే ఎవరని కమిషన్ ప్రశ్నించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అని ఆయన బదులిచ్చారు. నామినేషన్‌పై వ్యాప్కో్‌సకు అప్పగించాలని సీఎం నిర్ణయించారని మీరే రాశారు కదా? అని కమిషన్ ఒక లేఖను చూపించగా, నిజమేనని మురళీధర్ అంగీకరించారు.
కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన తనకు గుర్తు లేదని బదులిచ్చారు. తన జ్ఞాపకశక్తి తగ్గుతోందని, మతిమరుపు వచ్చిందని చెప్పారు. బ్యారేజీ నిర్మాణం లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను ఉద్దేశ పూర్వకంగానే పాటించలేదని కమిషన్ మురళీధర్‌ను తప్పుబట్టింది. స్టీల్ కొనుగోలుకు కాంట్రాక్టర్లుకు 60 శాతం సొమ్మును ముందుగానే చెల్లించాలని, అందుకు నిబంధనలను సడలించాలని ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తానే ప్రతిపాదించానని మురళీధర్ అంగీకరించారు. అదనపు పనులకు ఎంత వ్యయం చేసినా చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారా? అని అడగ్గా మినిట్స్ చూేస్త గాని చెప్పలేనని మురళీధర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ అభిప్రాయం తీసుకోకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ ప్రదేశాలను మార్చామని మురళీధర్ అంగీకరించారు. బ్యారేజీల నిర్మాణ గడువు పొడిగించడానికి ముందు నిర్మాణ సంస్థలపై నిబంధనల ప్రకారం జరిమానాలు ఎందుకు విధించలేదని రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును అడగగా, నిర్మాణ స్థలంలో పరిస్థితుల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని ఆయన బదులిచ్చారు. ఎవరి ఆదేశాలతో బ్యారేజీలలో నీటిని నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వం అని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. ప్రభుత్వమంటే ఎవరు? అని నిలదీయగా కేసీఆర్ అని బదులిచ్చారు. బ్యారేజీల నిర్వహణ, పర్యవేక్షణలో ఇద్దరు అధికారులు విఫలమయ్యారని, భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీల పట్ల కనీస శ్రద్ధ చూపలేదని కమిషన్ తప్పుబట్టింది.
సీడబ్ల్యూసీ లేఖలెందుకు దాచారు?
‘మీరు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా ఉన్నప్పుడు 2015 జనవరి 31, మార్చి 4 తేదీల్లో కేంద్ర జల సంఘం మీకు రాసిన లేఖలను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారా? అని గజ్వేల్ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించగా.. అవునని బదులిచ్చారు. నిపుణుల కమిటీతో పాటు కమిషన్‌కు కూడా లేఖలు ఇవ్వలేదని ఆధారాలున్నాయని కమిషన్ స్పష్టం చేసింది. తనకు గుర్తు లేదని, రికార్డులు పరిశీలించి చెప్తానని హరిరామ్ దాటవేశారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే పనులు ప్రారంభించడం, ప్రాజెక్టుకు రూ.81,911 కోట్ల అంచనాలతో ఒకే పరిపాలన అనుమతి ఇవ్వకుండా నిబంధనలకు విరుద్థంగా ఒక్కో పనికి విడివిడిగా అనుమతులివ్వడం, రూ.1,10,248 కోట్లతో వేర్వేరు పనులకు వేర్వేరు అనుమతులు ఇవ్వడం, రూ.1.09,768 కోట్లతో ఒప్పందాలు చేసుకోవడం నిజమేనా? అని కమిషన్ అడగ్గా కాగ్ అధికారి జె.నిఖిల్ చక్రవర్తి అవునని బదులిచ్చారు. కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనన్నారు.
Also Read:
గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు
ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..
రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..
For More Telangana News and Telugu News..
Updated Date - Feb 28 , 2025 | 03:25 AM