Jagga Reddy: రివెంజ్ పాలిటిక్స్ ఎవరికీ మంచిది కాదు
ABN, Publish Date - Jan 21 , 2025 | 03:49 AM
కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని చెప్పారు.
అలాంటి రాజకీయాలు చేసినోళ్లు.. అధికారం పోయాక బాధపడతారు
రాష్ట్ర ప్రజల రక్తంలో కక్ష సాధింపు లేదు
అలాంటి రాజకీయాలకు నేను వ్యతిరేకం
నాకు నష్టం చేసినా తిరిగి నష్టం చేయను
రాజకీయంగా మాత్రం పోరాడతాను
చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్.. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు
దేనికోసం పోరాడి అధికారంలోకి వచ్చామో దాన్ని అమలు చేయాలి: జగ్గారెడ్డి
నాతో సహా పైసలు ముట్టుకోని రాజకీయ నేత.. ఏ పార్టీలోనైనా ఉన్నాడా? అని ప్రశ్న
హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిన వాళ్లు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుందని అభిప్రాయ పడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలుగా చేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎవరైనా నష్టం చేస్తే.. తిరిగి వారికి నష్టం చేసే గుణం తనకు లేదన్నారు. కానీ వారితో రాజకీయంగా యుద్ధం మాత్రం చేస్తానని పేర్కొన్నారు. యుద్ధం వేరు.. కక్ష సాధింపు వేరని ఆయన చెప్పారు. అధికారం అనేది ఏ రాజకీయ పార్టీకీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తే ఆ తర్వాత పశ్చాత్తాపం పడాల్సి ఉంటుందున్నారు. రాజకీయ పోరాటం వేరు.. పాలన వేరని అభిప్రాయపడ్డారు. దేనికోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చామో దానిని అమలు చేయాలని సూచించారు. తనతో సహా ఏ పార్టీకి చెందిన నాయకుడైనా.. పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయగలుగుతాడని ఎవరైనా చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
సంగారెడ్డిలో నా ఓటమికి హరీశ్ కసిగా పనిచేశారు
సంగారెడ్డిలో తన ఓటమికి కారణం హరీశ్‌రావేనని జగ్గారెడ్డి వెల్లడించారు. సిద్దిపేటలో గెలవడానికి హరీశ్ ఎంత కష్ట పడ్డారో.. సంగారెడ్డిలో తనను ఓడగొట్టడానికి కూడా అంతే కష్టపడ్డారని చెప్పారు. ప్రతి సారీ ఎన్నికలకు మూడు రోజుల ముందు.. సంగారెడ్డిలో తాను నిర్వహించే సభను.. గత ఎన్నికల ముందు నిర్వహించకుండా హరీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. సంగారెడ్డిని గెలిచి తన మామ కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని హరీశ్ అనుకున్నారని, అందుకే ఆయన కసిగా పనిచేశారని వెల్లడించారు. అయితే తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధికారం ఉంది కదా అని కక్ష సాధింపు చర్యలు చేపట్టబోనని, రాజకీయంగానే కొట్లాడతానని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫస్ట్ ప్రోటోకాల్ అని చెప్పారు. అధికార పార్టీ అయినా సరే.. కార్పొరేషన్ చైర్మన్‌గా తన భార్య నిర్మలది ప్రొటోకాల్‌లో ఆ తర్వాతి స్థానమేనని అన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 03:49 AM