JAC Chennaiah: దేశవ్యాప్తంగా వర్గీకరణకు అభ్యంతరం లేదు
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:21 AM
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను దేశవ్యాప్తంగా అమలుచేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాల సంఘాల జేఏసీ జాతీయ చైర్మన్ జీ చెన్నయ్య హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తే అడ్డుకుంటాం
మంద కృష్ణ మాదిగది బీజేపీకి భజన డప్పు
మాదిగ బిడ్డల పోరాటం కేంద్రానికి తాకట్టు
మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య
బర్కత్‌పుర, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను దేశవ్యాప్తంగా అమలుచేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాల సంఘాల జేఏసీ జాతీయ చైర్మన్ జీ చెన్నయ్య హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణను అడ్డుకుంటున్నది మాలలు కాదని, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిలేనని ఆరోపించారు. ఈ నెల 7న లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం మాలలకు చావుడప్పులేనని మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన కొట్టాల్సిన చావుడప్పులు మాలలకు కాదని మోదీ, కిషన్ రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడుకేనని వ్యాఖ్యానించారు.
వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి భజన డప్పు కొడుతూ మాలలకు చావు డప్పు కొడతానంటే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పద్మశ్రీ అవార్డు కోసం 30 ఏళ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంద కృష్ణ మాదిగ తాకట్టుపెట్టారని ఆరోపించారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే సహించేది లేదని, తీవ్రస్థాయిలో తిరగబడతామన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఇకనైనా విమర్శలు మానుకోవాలని, లేకపోతే సరైన రీతిలో బుద్ధి చె బుతామని హెచ్చరించారు. లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమంలో ఏదైనా సంఘటన జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు.
Updated Date - Feb 04 , 2025 | 05:21 AM