ప్రమాదమా.. అనుమానాస్పదమా?
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:35 AM
: నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్లు ఉదయ సముద్రం ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారెడ్డి శిల్ప(35) మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మారెడ్డి శిల్ప మృతిపై అనేక సందేహాలు
పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు
కొనసాగుతున్న విచారణ
నల్లగొండ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్లు ఉదయ సముద్రం ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారెడ్డి శిల్ప(35) మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 22వ తేదీన సాయంత్రం పానగల్లులో రోడ్డు వెంట శిల్ప వాకింగ్ చేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇటీవల ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం డిసెంబరులో శిల్ప తన భర్తతో విభేదాల కారణంగా ఆమె జిల్లాకేంద్రంలోని ఓ పోలీస్ అధికారిని ఆశ్రయించింది. ఆ సమయంలో సదరు పోలీస్ అధికారి ఆ మహిళా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆమెను ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరి మధ్య సెల్‌ఫోన్ చాటింగ్ కూడా జరగడం, అందులో వారి మధ్య సాన్నిహిత్యం ఏ స్థాయికి వెళ్లిందనేది సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. శిల్ప భర్తపై కేసు పెట్టిన సమయంలో సదరు పోలీస్ అధికారి ఇదే అదనుగా ఆ వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా గుట్టుగా చాటింగ్ జరుగుతున్న విషయాన్ని శిల్ప భర్త గమనించి అప్పట్లో జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేసి, ఐజీ కార్యాలయానికి అటాచ్ కూడా చేశారు. ఆ విషయం సదుమణిగిందనుకున్న సమయంలో శిల్ప అనుమానాస్పద మృతితో ఆ పోలీస్ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలైనప్పుడు 108 వాహనానికి ఫోన్ చేసింది ఎవరు.. ఆ సమయంలో ప్రమాదాన్ని ఎవరైనా చూశారా అనేది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.
కుటుంబ సభ్యుల ఆందోళనతో చర్చ
శిల్ప మృతిచెందడంతో గత ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు రాత్రి నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తన కూతురు మరణానికి కారణమైన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని శిల్ప తల్లి పద్మ డిమాండ్ చేసింది. ఆ పోలీస్ అధికారే గత నెల 22న తన కూతురికి ఫోన్ చేసి పానగల్లులోని ఛాయ సోమేశ్వరాలయానికి రావాలని కోరడంతో ఆమె వెళ్లిందని తల్లి పేర్కొన్నారు. తన కూతురికి అన్యాయం చేసిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. న్యాయం చేస్తామని సీఐ రాఘవరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన విషయం తెలిసిందే. గాంధీనగర్‌లో నివాసముంటున్న మారెడ్డి శిల్ప 22 తేదీ సాయంత్రం పానగల్లు ప్రాంతానికి వాకింగ్‌కు వెళ్లడం ఆమెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నల్లగొండ టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు కూడా అందింది. ఆమె అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శిల్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె భర్త మారెడ్డి ప్రశాంత్‌రెడ్డి, శిల్ప తల్లి పద్మతో కలిసి బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో కిందపడిన శిల్ప వెంటనే కోమాలోకి వెళ్లడంతో వాస్తవాలు తెలియకుండా పోయాయని సమాచారం. ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని స్థానిక పోలీసులు పేర్కొ ంటున్నారు. ఇందులో వాస్తవాలు అన్ని వెలుగులోకి తీయాలని కుటుంబ సభ్యులు కోరారు. శిల్ప మృతి వెనక ఓ అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నామని నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ సైదులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - Jun 06 , 2025 | 12:35 AM