Medak: ఆ ఐదుగురు చిన్నారులకు ఏమైంది
ABN, Publish Date - Jun 08 , 2025 | 06:19 AM
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఒకేసారి అస్వస్థతకు గురికాగా...వారిలో ఓ చిన్నారి కన్నుమూసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో శనివారం ఈ ఘటన జరగ్గా.. అసలు ఆ చిన్నారులకు ఏమైంది? అనేది చర్చనీయాంశమైంది.
కుటుంబంలోని ఐదుగురు చిన్నారులకు ఒకేసారి అస్వస్థత.. ఒకరి మృతి
తల్లిదండ్రుల సొంత వైద్యం వికటించిందా? అని అనుమానాలు
అల్లాదుర్గం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఏమైందో.. ఎలా జరిగిందో సరైన కారణం తెలియదు కానీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఒకేసారి అస్వస్థతకు గురికాగా...వారిలో ఓ చిన్నారి కన్నుమూసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో శనివారం ఈ ఘటన జరగ్గా.. అసలు ఆ చిన్నారులకు ఏమైంది? అనేది చర్చనీయాంశమైంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. అల్లాదుర్గంలోని బుడగజంగంకాలనీకి చెందిన సిద్దయ్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఐశ్వర్య, రేణుక, ప్రియ(5), ఇద్దరు కొడుకులు శ్రీను, గణేష్ ఉన్నారు. పిల్లలంతా పదేళ్ల లోపు వారే. నెల క్రితం పిల్లలంతా అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స చేయించారు. తాజాగా ఈనెల 3న ప్రియ, ఐశ్వర్య వాంతులు, విరేచనాలతో మిగిలిన పిల్లలు దగ్గు, జలుబుతో బాధపడ్డారు. ఇక, శుక్రవారం రాత్రి పిల్లలంతా అస్వస్థతకు గురికావడంతో.. నెల క్రితం పీహెచ్‌సీలో ఇచ్చిన మందులనే తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చారు. అయితే, శనివారం ఉదయానికి పిల్లలంతా అపస్మారక స్థితిలో ఉండగా వారిలో ప్రియ మాత్రం మరణించింది. మిగిలిన వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేణుక, గణేష్ ప్రస్తుతం కోలుకోగా.. శ్రీను, ఐశ్వర్యకు చికిత్స సాగుతోంది. సాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jun 08 , 2025 | 06:20 AM