ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి పెట్టండి:పొంగులేటి
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:50 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్ విషయంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని...
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్ విషయంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని, ఈ ప్రయోజనాన్ని లబ్ధిదారులే పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. వీటిలో 1.03 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 23 నాటికి గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకుగాను 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా గ్రౌండింగైన ఇళ్ల బేస్‌మెంట్ పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
Updated Date - Jun 25 , 2025 | 07:51 AM