CM Revanth Reddy: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - Jul 24 , 2025 | 07:06 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rains) కురుస్తోంది. వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో మాదాపూర్, మియాపూర్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిచిపోయాయి. ఒక వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. మియాపూర్ ఆల్విన్ కాలనీ- బొల్లారం చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరదనీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
మున్నేరులో చిక్కుకున్న పశువుల కాపరులు..
ఖమ్మం జిల్లాలోని మున్నేరులో ఐదుగురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. పశువులను మేపడానికి ఉదయం మున్నేరు లంకలోకి కాపరులు వెళ్లారు. చింతకాని మండలం చిన్నమండవ వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోండటంతో పశువుల కాపరులు చిక్కుకుపోయారు. మున్నేరులో చిక్కుకున్న పశువుల కాపరుల అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పశువుల కాపరులను కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 08:24 PM