IT Jobs Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా.. లక్షలు కాజేసి ఆపై..
ABN, Publish Date - Feb 18 , 2025 | 02:09 PM
హైదరాబాద్: నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో కాలువ భార్గవ్ అనే వ్యక్తి ఓ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెజ్యూమ్‌లు కొనుగోలు చేశాడు.
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నకిలీ ఐటీ కంపెనీ దారుణంగా మోసం చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతీయువకుల నుంచి లక్షలు కాజేసి చివరికి బోర్డు తిప్పేశారు. మాదాపూర్‌లో నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో కాలువ భార్గవ్ అనే వ్యక్తి ఓ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెజ్యూమ్‌లు కొనుగోలు చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో యువతకు గాలం వేశాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ పంపాడు కేటుగాడు భార్గవ్. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగం కావాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి పలువురి నుంచి లక్షలు కాజేశాడు. ఎన్ని నెలలు గడిచినా ఉద్యోగాలు మాత్రం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పలుమార్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిలదీశారు. దీంతో నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
నిందితుడు భార్గవ్ బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు కొట్టేశాడని పోలీసులు తెలిపారు. గతంలో ఓ ఐటీ కంపెనీలో నిందితుడు హెచ్‌ఆర్‌గా పని చేశాడని చెప్పారు. దీంతో అతనికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, ఫార్మాలిటీలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ఆ అనుభవంతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను బురిడీ కొట్టించాడని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ.లక్ష, ఐదు నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, రెండు ఐడీ కార్డులు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్‌తోపాటు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్లలో భార్గవ్‌పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసు.. పోలీస్ కస్టడీలో అసలు నిజాలు..
Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను విమాన ప్రమాదం..
Updated Date - Feb 18 , 2025 | 02:09 PM