Kavitha On BC: జాగ్రత్త పడండి.. రేవంత్ సర్కార్‌కు కవిత సూచన!
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:23 PM
MLC Kavitha: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకుండా ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడము అంతే ముఖ్యమన్నారు.
హైదరాబాద్, జులై 16: ఈరోజు తన నివాసంలో యూపీఎఫ్ (UTF) నాయకులు, 72కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 25వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 25వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని అన్నారు. బీసీలకు (BC Reservation) 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ సవరణ చేయాలి..!
సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడమూ అంతే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. అది కేంద్రం పరిధిలో ఉంటుందని, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని వ్యాఖ్యానించారు
జాగ్రత్త పడాలి..!
గవర్నర్ కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదం ఉందన్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గం అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మల్నాడు డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు
హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే
Updated Date - Jul 16 , 2025 | 05:36 PM