TG Assembly: బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ మద్దతు.. శాసనసభలో ఆసక్తికర ఘటన.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:38 PM
తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీసీ కులగణన సర్వేపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. అసలు శాసనసభలో ఏం జరిగిందంటే..
కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కులగణన సర్వేపై చర్చ సందర్భంగా బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సర్వేలో బీసీల జనాభా తగ్గిందన్నారు. కులగణనలో పలు తప్పులు జరిగాయన్నారు. సమగ్రంగా సర్వే జరగలేదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయన్నారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోల్చిచూస్తే ప్రస్తుత సర్వేలో బీసీ జనాభా తగ్గిందన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ కులగణనపై అద్భుతంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు విని ఎంతో సంతోషించానని పాయల్ శంకర్ తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పొంతన లేదన్నారు. తన ఇంటికి సర్వేకు సంబంధించి రెండు స్టిక్కర్లు అంటించారని, సర్వేలో అనేక తప్పులు జరిగాయని, సమగ్రంగా జరగలేదని, పూర్తిస్థాయిలో ప్రజలు కులగణనలో పాల్గొనలేదని పాయల్ శంకర్ పేర్కొన్నారు.
మంత్రుల స్పందన..
పాయల్ శంకర్ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ స్పందించారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా కులగణన నిర్వహించిందన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా సభలో మాట్లాడవద్దన్నారు. ఈ లెక్కలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేష్లు కల్పించాలంటే చట్టసవరణ జరగాల్సి ఉంటుందని, కానీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 శాతం సీట్లు బీసీ అభ్యర్థులకు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పాయల్ శంకర్ ప్రసంగానికి పదేపదే మంత్రులు మధ్యలో స్పందించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం తెలిపారు.
తలసాని ఏమన్నారంటే
సభలో బీసీల హక్కుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు చెప్పేది వినాలని, మంత్రులు చివరిలో స్పందించాలని, మధ్యమధ్యలో అడ్డుతగలడం సరికాదంటూ పాయల్ శంకర్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రతి సభ్యుడు చెప్పే విషయాన్ని, సూచనను ప్రభుత్వం వినాలన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ పాలించినా, 55 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ఇప్పటివరకు బీసీల కోసం ఏం చేసిందనేది ఆలోచించాలన్నారు. బీసీ కులగణనపై సభలో చర్చ సందర్భంగా పాయల్ శంకర్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతుగా మాట్లాడటం ఆసక్తి నెలకొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News click Here
Updated Date - Feb 04 , 2025 | 04:54 PM