TG Govt: హ్యామ్ రోడ్లకు ప్రత్యేక అథారిటీ
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:22 AM
రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్రస్థాయి వరకు పలు రోడ్ల నిర్మాణం, విస్తరణను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో చేపట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రత్యేక పర్యవేక్షణకు వీలుగా ఏర్పాటు
చేయాలని ప్రాథమికంగా సర్కారు నిర్ణయం
విడిగా కార్యాలయం, ఇంజనీర్లు, సిబ్బంది..
ఐఏఎస్ లేదా ఆ స్థాయి అధికారికి బాధ్యతలు
జాతీయ రహదారుల సంస్థ తరహాలో పనితీరు
హ్యామ్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పేరు పెట్టాలని
సర్కారు నిర్ణయం.. పరిశీలనలో 4 పేర్లు
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్రస్థాయి వరకు పలు రోడ్ల నిర్మాణం, విస్తరణను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో చేపట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిసింది. హ్యామ్ రోడ్ల గుర్తింపు, ఖరారు, నిర్మాణం, నిధుల వ్యయం తదితర అంశాలను ఈ అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాచారం. దీనికి ఐఏఎస్ అధికారి లేదా ఆ స్థాయి హోదా ఉన్న మరో అధికారిని నియమించాలని భావిస్తున్నట్టు.. సచివాలయానికి దగ్గర్లోనే ఓ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అథారిటీకి ఎందరు ఇంజనీర్లు, సిబ్బంది అవసరమనే అంశంపై ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జాతీయ రహదారుల సంస్థ తరహాలో..
వాస్తవానికి హ్యామ్ కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్టు అమలు విభాగం (పీఐయూ)’ను ఏర్పాటు చేయాలని మొదట భావించారు. కానీ దానితో ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవని, అథారిటీ అయితేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ క్రమంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహణ, వ్యవహారాలను అధికారులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌హెచ్‌ఏఐకు రాష్ట్రాల వారీగా రీజనల్ ఆఫీ్‌సలు ఉన్నాయి. వాటిలో కొందరు సిబ్బందితోపాటు డివిజన్ల వారీగా ఇంజనీర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇదే తరహాలో హ్యామ్ రోడ్ల కోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తే.. రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నిజానికి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల్లో ఈఎన్సీలు, ఇంజనీర్లు ఉన్నా.. వారికి ఇప్పటికే రోడ్ల మరమ్మతులు, వార్షిక నిర్వహణ, వానాకాలం సీజన్‌లో చేపట్టాల్సిన పనులు, ఇతర బాధ్యతలు ఉన్నాయి. పైఆ హ్యామ్ రోడ్ల గుర్తింపు, నిర్మాణం, నిధుల విడుదల వ్యవహారం ప్రత్యేక విధానంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేక అథారిటీకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ప్రత్యేక పర్యవేక్షణకు వీలుగా..
హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కనుక ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు, నిర్మాణాలు, నిధుల చెల్లింపు అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. హ్యామ్ విధానంలో పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కలిపి మొత్తం 28వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నారు. 15 ఏళ్ల వరకు ఈ రోడ్ల నిర్వహణను గుత్తేదారులే పర్యవేక్షించేలా నిబంధన పెట్టనున్నారు.
హ్యామ్ విధానం అంటే..
సాధారణంగా ప్రభుత్వమే మొత్తం నిధులిచ్చే ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యుర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్), మొత్తం నిధులు కాంట్రాక్టు సంస్థే భరించే బీవోటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతుల్లో రోడ్లను నిర్మిస్తారు. ఇందులో ఈపీసీ విధానంలో ప్రభుత్వంపై ఒకేసారి రోడ్డు నిర్మాణ భారం పడుతుంది. బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టు సంస్థే మొత్తం వ్యయాన్ని భరించినా.. సదరు రోడ్లపై టోల్‌గేట్లు పెట్టి సొమ్ము రికవరీ చేసుకుంటుంది. ఈ రెండు పద్ధతులను కలిపి.. ప్రభుత్వానికి సులభంగా ఉండేలా, ప్రజలపై భారం పడకుండా ‘హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్)’ను రూపొందించారు. ఈ విధానంలో టెండర్ దక్కిన కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం తొలుత 40 శాతం నిధులు ఇస్తుంది. మిగతా 60శాతం కాంట్రాక్టు సంస్థలే భరించి పనులు పూర్తి చేస్తాయి. ఈ నిధులను ప్రభుత్వం 10-15 ఏళ్ల పాటు ఏటా కొంత మొత్తం చొప్పున వడ్డీతో తిరిగి చెల్లిస్తుంది. ఈరోడ్లపై టోల్ వసూలు చేయరు.
Updated Date - Jun 25 , 2025 | 04:23 AM