kumaram bheem asifabad- మానవ అక్రమ రవాణా ముఠా పట్టివేత
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:34 PM
యువతులకు మాయమాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రెండు కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- ఆధార్ అప్‌డేట్‌తో వెలుగులోకి
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ రామానుజం
ఆసిఫాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): యువతులకు మాయమాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రెండు కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొంది గ్రామానికి చెందిన గిరిజన యువతి ఏడాది క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి తన కూతురు కోసం గాలిస్తున్నాడు. సదరు యువతి గత నెలలో ఆధార్‌కార్డు అప్‌డేట్ చేసింది. ఆ కార్డు బాధితురాలి ఇంటికి పోస్టులో వచ్చింది. కార్డుపై ఉన్న ఫోన్ నంబరుకు డయల్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నంబరుగా తెలియడంతో బాధితురాలి తండ్రి వారం రోజుల క్రితం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కేంద్రంలోని మరో బాధితురాలు సైతం పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రెండు కేసులలో సంబంధం ఉన్న తొమ్మిది మంది నిందితులను గుర్తించారు. ఇందులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మొదటి యువతిని రూ. 1,30,000లకు, రెండో యువతిని రూ. 1,10,000 లకు విక్రయించారు. కాగా రెండో యువతి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే ఉంటున్నది. కానీ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మధ్యప్రదేశ్ యువతి వ్యవహారం బయటకి రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొమ్మిది మంది నిందితుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఇందులో ఏ1గా పరికిపండ్ల విజయలక్ష్మి, ఏ2గా సత్యంశెట్టి సుజాతా, ఏ3గా పంచపూల, ఏ4గా తాడూరి ఉష, ఏ5గా హరిదాస్(సస్పెండ్ అయిన కానిస్టేబుల్), ఏ6గా సుధాకర్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏ7 రమేశ్‌గౌడ్, ఏ8 సురేఖ, ఏ9 జగదీష్‌లు పరారీలు ఉన్నారని వీరి కోసం ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి రూ. 50 వేలు, ఆరు మోబైల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిలో హరిదాస్, సురేఖ ఇప్పటికే ఇటువంటి కేసులలో నిందితులుగా ఉన్నారని డీఎస్పీ వివరించారు. బాదిత మహిళలు ఇద్దరు ఎస్టీలు కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు మానవ అక్రమ రవాణా, లైంగిక నేరాల కేసు, అనైతిక నేరాల కేసును నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ బుద్దె రవీందర్, ఎస్సై ప్రశాంత్ పాల్గొన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 11:34 PM