ఏం సాధించారని రైతు సంబురాలు?: హరీశ్
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:56 AM
రైతు సంబురాలు ఎందుకు చేస్తున్నారని, ఏం సాధించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రైతు సంబురాలు ఎందుకు చేస్తున్నారని, ఏం సాధించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతు సంబురాలు అంటూ సచివాలయం ముందు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తన సంకుచిత మనస్తత్వాన్ని బయటపెటుకున్నారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని విమర్శించారు. తెలంగాణకు శనిలా శాపంలా మారిన రేవంత్‌రెడ్డి ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అనే రీతిలో పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై భరోసా లేక విధిలేని పరిస్థితుల్లో రైతు భరోసా నిధులు ఇచ్చి.. తానే రైతులకు ఛాంపియన్ అని రేవంత్ రెడ్డి దర్పాన్ని ప్రదర్శిస్తే నమ్మేవారెవరు లేరని ఆయన అన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 04:58 AM