Section Officers Transfer: 177 మంది సెక్షన్ ఆఫీసర్ల బదిలీ!
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:33 AM
ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన చేపట్టింది. 177 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్‌వో)ను బదిలీ చేసింది. దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో ఉన్నవారికి స్థాన చలనం కలిగించింది.
సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన
రెండు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం
‘ఫోకల్ నుంచి ఫోకల్’కు బదిలీలంటూ ఆరోపణలు
15 ఏళ్లుగా ఒకే పోస్టులో ఉన్నవారినీ మార్చని వైనం
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన చేపట్టింది. 177 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్‌వో)ను బదిలీ చేసింది. దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో ఉన్నవారికి స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రెండు జీవోలను జారీ చేశారు. 236 జీవో ద్వారా 160 మంది ఎస్‌వోలను, 237 జీవో ద్వారా 17 మందిని బదిలీ చేశారు. కొంత మందిని నాన్-ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకు మార్చినా.. ఇంకా కొందరిని ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకే బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ, సహకార శాఖ నుంచి 10 మందిని, పశు సంవర్ధక శాఖ నుంచి నలుగురిని, వెనకబడిన తరగతుల నుంచి ఐదుగురిని, అటవీ శాఖ నుంచి ముగ్గురిని, విద్యుత్తు శాఖ నుంచి నలుగురిని, సాధారణ పరిపాలనా శాఖ నుంచి 36 మందిని, ఉన్నత విద్యా శాఖ నుంచి ఇద్దరిని, ఆరోగ్య శాఖ నుంచి ఐదుగురిని, హోంశాఖ నుంచి 10 మందిని, నీటి పారుదల శాఖ నుంచి 13 మందిని, పరిశ్రమల శాఖ నుంచి 8 మందిని, కార్మిక శాఖ నుంచి నలుగురిని, పురపాలక శాఖ నుంచి 8 మందిని, మైనారిటీ సంక్షేమం నుంచి ఇద్దరిని, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ నుంచి ఒక్కరిని, ప్రణాళిక శాఖ నుంచి ఆరుగురిని, పంచాయతీరాజ్ శాఖ నుంచి 9 మందిని, రెవెన్యూ శాఖ నుంచి 19 మందిని, ఎస్సీ అభివృద్ధి, పాఠశాల విద్యా శాఖల నుంచి ఆరుగురి చొప్పున, రవాణా శాఖ నుంచి 9 మందిని, గిరిజన, మహిళ సంక్షేమ శాఖలు, యువజన సర్వీసుల శాఖల నుంచి ఇద్దరేసి అధికారులను బదిలీ చేసింది.
చాలా కాలం తర్వాత బదిలీలు..
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సచివాలయంలో సెక్షన్ అధికారుల స్థాయిలో బదిలీలు జరగలేదు. ఏ శాఖలోనైనా అత్యంత ప్రధానమైన జీవోలను తయారు చేసేది ఈ అధికారులే. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు చేసే సూచనల మేరకు వీరు జీవోలను రూపొందిస్తారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారులను బదిలీ చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. సచివాలయ నియమాలు, సర్వీసు నిబంధనల ప్రకారం.. సచివాలయంలో ఒక పోస్టులో మూడేళ్లకు మించి పని చేయడానికి వీల్లేదు. ఒకే శాఖలో ఆరేళ్లకు మించి పని చేయరాదు. కానీ, కొంతమంది ఎస్‌వోలు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. రెవెన్యూ, సాగునీటి పారుదల, పురపాలక, వైద్య ఆరోగ్యం, విద్య, విద్యుత్తు, ఆర్థికం వంటి కీలక శాఖల్లో కొంత మంది అధికారులు పాతుకుపోయి ఉండడంపై ఆరోపణలు వచ్చాయి.
ఒకే పోస్టులో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నవారూ ఉన్నారు. ఇలాంటి వారందరినీ ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. కానీ, ఈ బదిలీలపై ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలొస్తున్నాయి. కొంత మందిని ఫోకల్ పాయింట్ నుంచి ఫోకల్ పాయింట్‌కే మార్చారన్న ఆరోపణలున్నాయి. సాధారణ పరిపాలన శాఖలో 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఒక ఎస్‌వోను బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యకార్యదర్శులతో సన్నిహితంగా ఉన్నవారిని బదిలీ చేయలేదని అంటున్నారు. నాన్ ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకు, ప్రాధాన్య పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు. అయినా కొన్ని బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని సచివాలయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 04:33 AM