ప్రాజెక్టులకు మంచి రోజులు
ABN, Publish Date - May 04 , 2025 | 11:56 PM
నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, నక్కలగండి రిజర్వాయర్‌లు పూర్తిచేయాలని ప్రభు త్వం నిధులు కేటాయించింది.
ఏఎమ్మార్పీ లైనింగ్, శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, నక్కలగండిపై సీఎం ప్రత్యేక దృష్టి
నిధులు కేటాయించిన ప్రభుత్వం
ముందుకుసాగనున్న పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దేవరకొండ, మే 4(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, నక్కలగండి రిజర్వాయర్‌లు పూర్తిచేయాలని ప్రభు త్వం నిధులు కేటాయించింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మరమ్మ తులకు ప్రభుత్వం ఇటీవల రూ.442కోట్లు కేటాయించి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల, నక్కలగండి రిజర్వాయర్ పనులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారు దలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దేవరకొండ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ మరమ్మతులకు రూ.442 కోట్లు
2001లో ప్రారంభించిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మరమ్మత్తులకు మోక్షం వచ్చింది. నల్లగొండ జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీటితోపాటు హైదరాబాద్ జంటనగరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును 2001లో ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి మరమ్మతులు నిర్వహించలేదు. ప్రాజెక్టు పరిధిలో 22.500 కిలో మీటర్లమేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఏఎమ్మార్పీ నుంచి పానగల్ రిజర్వాయర్ వరకు విస్తరించి ఉన్న ఏఎమ్మార్పీ కాల్వలకు మర మ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు కేటాయించింది. ఏఎమ్మార్పీ పరిధిలోని డిస్ర్టీబ్యూటరీలు, కాల్వలు, కంపచెట్లు పేరుకుపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. నాలుగు మోటర్లతో నీటిని విడుదల చేస్తున్నప్పటికీ నీరు వృధా అవుతుంది. మర మ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలోని లీకేజీలను అరికట్టే అవకాశాలున్నాయని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నక్కలగండి రిజర్వాయర్‌కు త్వరలో అటవీ శాఖ అనుమతులు నక్కలగండి రిజర్వాయర్‌ను భూములు కోల్పోతు న్న భూనిర్వాసితులందరికి ప్రభుత్వం పరిహారం, పునరావాసం కల్పించింది. నక్కలగండి, మోత్యతండా లో ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూపరిహారం అందజేశారు. పునరావాసం కింద చింతపల్లి మండలం నసర్లపల్లిలో 15 ఎకరాలు కెటాయించి ఇళ్లు, పునరావాసం కల్పించినట్లు అధికారులు తెలుపుతున్నారు. త్వరలో అటవిశాఖ అనుమ తి వస్తుందని దీంతో రోడ్ల నిర్మాణ పనులు పూర్తవుతున్నట్లు ఏఎమ్మార్పీ అధికారులు తెలుపుతున్నారు. కాగా ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్, పెండ్లిపాకల ఎత్తుపెంపు పనులు 30శాతం గతంలో పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో పనులు నిలిచిపోయాయి. ఓపెన్‌కెనాల్, పెండ్లిపాకల ఎత్తుపెంపు పనులకు కూడ ప్రభుత్వం నిధులు కెటాయించి మళ్లీ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సన్నాహా లు చేపడుతుంది. ప్రాజెక్టులు పూర్తియితే దేవరకొండ నియోజకవర్గంలో మూడున్నర లక్షల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది.
టన్నెల్ బేరింగ్ మిషన్ పిట్టింగ్ పనులు ప్రారంభం
అమెరికా నుంచి శ్రీశైలం సొరంగమార్గం టన్నెల్ బేరింగ్ మిషన్ మన్నేవారిపల్లి ఔట్‌లెట్‌కు చేరుకోవడంతో టన్నెల్-1 వద్ద టన్నేల్ బేరింగ్ మిషన్ పిట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. చిన్న, చిన్న పరికరాలు జర్మనీ, కెనడా దేశాల నుంచి రానున్నాయి. రెండు నెలల్లో టన్నెల్ బేరింగ్ మిషన్ ఫిట్టింగ్ పనులు పూర్తిచేసి తవ్వకాలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2007లో రూ.1925కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన శ్రీశైలం సొరంగ మార్గం పనులు 44.6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 30.4 కిలోమీటర్లమేర తవ్వకాలు నిర్వహించారు. ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులు మరో 9.6కిలోమీటర్లమేర తవ్వాల్సి ఉంది. శ్రీశైలం దోమలపెంట ఇన్‌లెట్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో టన్నెల్ కూలి ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. ఆరుగురి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీశైలం సొరంగమార్గం 2007లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు. రూ.1925 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. ఏళ్లు గడుస్తుండడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం శ్రీశైలం సొరంగమార్గం పనులు పట్టించుకోక నిధుల కేటాయింపులో జాప్యం చేయడం, టన్నెల్ బేరింగ్‌మిషన్ తరచు మరమ్మతులకు గురవుతుండడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ, శ్రీశైలం సొరంగమార్గం అంచనా వ్యయం రూ.4637 కోట్లు ప్ర భుత్వం కేటాయించింది. రెండున్నర ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అమెరికా నుంచి బేరింగ్ మిషన్ మన్నెవారిపల్లి సొరంగమార్గం వద్దకు చేరుకోవడంతో పనులు పునః ప్రారంభమవుతాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డిండి ఎత్తిపోతల పనులకు రూ.1800 కోట్లు కేటాయింపు
డిండి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1800 కోట్లు కేటాయించింది. ఎదుళ్ల నుంచి డిండి అనుసంధాన ప్రాజెక్టు పనులకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎదుళ్ల, ఉల్పర అనుసంధాన పనులకు రూ.1800 కోట్లు కెటాయించడంతో డిండి ఎత్తిపోతల పనులు ఊపందుకున్నాయి. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా గొట్టిముక్కల, సింగరాజు పల్లి, శివన్నగూడెం, చింతపల్లి, కిష్టరాయన్‌పల్లి, ఇర్విన్, ఉల్పర రిజర్వాయర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ, పునరా వాస ప్రక్రియ దాదాపుగా పూర్తి చేశారు. టెడర్లు పిలిస్తే ఎదుళ్ల నుంచి డిండి ఎత్తిపోతల అనుసంధాన పనులు వేగవంతం కానున్నాయి.
ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తాం
శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు నిధులు కేటాయిస్తూ ప్రత్యేక దృష్టి సారించారు. ఏఎమ్మార్పీ మరమ్మతులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ప్రాజెక్టులు పూర్తియితే దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది.
- నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే
Updated Date - May 04 , 2025 | 11:56 PM