JNTU: దిగొచ్చిన ’గోకరాజు’ ఇంజనీరింగ్ కాలేజీ
ABN, Publish Date - Feb 20 , 2025 | 04:18 AM
గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఎట్టకేలకు మెట్టు దిగింది. ప్రభుత్వ నిబంధనలు, వర్సిటీ ఆదేశాలను బేఖాతరు చేసిన కారణంగా గోకరాజు కాలేజీ యాజమాన్యంపై జేఎన్‌టీయూ అధికారులు కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.
విద్యార్థుల చేతికి ధ్రువపత్రాలు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఎట్టకేలకు మెట్టు దిగింది. ప్రభుత్వ నిబంధనలు, వర్సిటీ ఆదేశాలను బేఖాతరు చేసిన కారణంగా గోకరాజు కాలేజీ యాజమాన్యంపై జేఎన్‌టీయూ అధికారులు కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరైనా పలువురు విద్యార్థులకు చెందిన ఒరిజినల్ ధ్రువపత్రాలను వెనక్కి ఇవ్వకపోవడంతో వారంతా జేఎన్‌టీయూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కళాశాలకు జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ వర్సిటీ రిజిస్ర్టార్ షోకాజ్ నోటీ సులు జారీ చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం కలవరపాటుకు గురైంది.
ప్రిన్సిపాల్‌తోసహా డైరెక్టర్, డీన్ తదితరులు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి బాధిత విద్యార్థులను, వర్సిటీ ఉన్నతాధికారులను క్షమాపణలు కోరారు. అప్పటికప్పుడే బాధిత విద్యార్థులను వెంటబెట్టుకొని కళాశాలకు తీసుకెళ్లిన గోకరాజు యాజమాన్య ప్రతినిధులు వారి సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మెమో జారీ చేశారు.
Updated Date - Feb 20 , 2025 | 04:18 AM