సిద్దిపేట మహిళకు గులియన్ బారీ సిండ్రోమ్
ABN, Publish Date - Feb 01 , 2025 | 03:37 AM
మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది!
కిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స.. పరిస్థితి విషమం.. మహారాష్ట్రలో కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున కేసులు
హైదరాబాద్ సిటీ, సిద్దిపేట టౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది! ఆమెను పరీక్షించి, వారంరోజులపాటు చికిత్స చేసిన స్థానిక వైద్యుల సూచన మేరకు.. కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే బాధితురాలుగానీ, ఆమె కుటుంబసభ్యులుగానీ ఎవరూ ఎప్పుడూ పుణెకు వెళ్లలేదని వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తీవ్ర జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడిందని.. క్రమంగా కాళ్లు, చేతుల్లో సత్తువ కోల్పోయి నడవలేని, కదల్లేని పరిస్థితికి చేరుకుందని వెల్లడించారు. కాగా.. ఇదేమీ అంత అసాధారణ సమస్య కాదని.. వర్షాకాలం సీజన్‌లో ఈ తరహా సిండ్రోమ్‌తో కొంతమంది రోగులు వస్తుంటారని కిమ్స్ న్యూరాలజిస్టు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్ బారిన పడి రోగ నిరోధక శక్తి సన్నగిల్లడంతో కొంతమంది జీబీఎస్ బారిన పడుతుంటారని ఆయన చెప్పారు. గత వర్షాకాలంలో తాము ఇలా ముప్పై మందికి చికిత్స చేశామని, సరైన సమయంలో కచ్చితమైన మందులు వినియోగిస్తే వారంలో తగ్గిపోతుందని, మరికొందరికి ఆరు నెలల సమయం పట్టవచ్చునని ఆయన వెల్లడించారు. వందలో ఒకరిద్దరికి మాత్రమే పరిస్థితి తీవ్రతరమవుతుందని.. బాగా బలహీనంగా ఉండేవారికే ఈ సమస్య ఎక్కువని వివరించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని స్పష్టం చేశారు.
ఇవీ లక్షణాలు..
వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారినపడినప్పుడు అప్రమత్తమైన రోగనిరోధక వ్యవస్థ.. హానికారక జీవులను చంపడంతోపాటు నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా.. వెన్నుపూస నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నాడుల మీద ఉండే మైలీన్ అనే రక్షణ పొరను రోగనిరోధక వ్యవస్థ దెబ్బతీయడం వల్ల క్రమంగా కండరాలు బలహీనమైపోయి పక్షవాతానికి దారితీస్తుంది. కొంతమందికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడినవారు లక్షణాలను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ దూరం నడవలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వేళ్లు, మడమలు, మణికట్టు భాగాల్లో పొడుస్తున్నట్లుగా ఉండడం, కాళ్లు, చేతులు బలహీనంగా మారి పనిచేయనట్లు అనిపించడం, బీపీ, గుండె స్పందనలో తేడా చోటు చేసుకోవడం సమస్యలు ఉండే అవకాశముందని వైద్యులు వివరించారు. ఈ లక్షణాలతోపాటు నీళ్ల విరేచనాలు, కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 03:37 AM