Medak District: రైతు భరోసా డబ్బు ఇవ్వలేదని.. తండ్రి నాలుక కోసేశాడు
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:16 AM
రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకివ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన కన్నతండ్రి నాలుక కోశాడు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
6 వేలలో 2 వేలు ఖర్చు చేసిన తండ్రి
మిగిలిన సొమ్ము ఇస్తానన్నా సరే దాడి చేసిన కొడుకు
మెదక్ జిల్లాలో దారుణ ఘటన
హవేళిఘణపూర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకివ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన కన్నతండ్రి నాలుక కోశాడు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బానోత్ కీర్యాకు ఎకరం భూమి ఉంది. రైతు భరోసా కింద అతని బ్యాంకు ఖాతాలో రూ.6వేలు జమ అయ్యాయి. ఆ డబ్బు తనకి ఇవ్వమని కీర్యాను అతని చిన్న కొడుకు సంతోష్ అడిగాడు. అయితే, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అందులో రూ.2 వేలు ఖర్చు చేశానన్న కీర్యా.. మిగిలిన రూ.4వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్.. తండ్రిపై దాడి చేశాడు. తండ్రిని కొట్టడమే కాక కొడవలితో అతని నాలుక కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కీర్యాను స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కీర్యా భార్య మాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jun 25 , 2025 | 04:17 AM