ఒక్క ఇల్లు ఇచ్చినట్లు నిరూపించినా రాజకీయ సన్యానం తీసుకుంటా
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:15 PM
బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఊట్కూర్ మండలంలో ఇచ్చినట్లు నిరూపిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుంటానని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, డైరీ డెవల్‌పమెంట్, యువజన, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి అన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఊట్కూర్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు
మండలానికి మేము 300 ఇళ్లు ఇచ్చాం
రాష్ట్ర పశుసంవర్థక శఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఊట్కూర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఊట్కూర్ మండలంలో ఇచ్చినట్లు నిరూపిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుంటానని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, డైరీ డెవల్‌పమెంట్, యువజన, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆయన ఊట్కూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి?.. అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినోళ్లు మండలానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఊట్కూర్ మండలానికి 300 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.ఐదు లక్షల చొప్పున రూ.15 కోట్లు మండలానికి కేటాయించామన్నారు. మక్తల్ నుంచి నారాయణపేటకు నాలుగు లేన్ల రోడ్డును మంజూరు చేయించామని చెప్పారు. అర్హులైన ప్రతీ పేదవాడికి పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అంతకు ముందు పెద్దపొర్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పీవోడబ్ల్యూ మహిళా సంఘం నాయకులు చిన్నపొర్ల, పెద్దపొర్ల గ్రామాల మధ్య బీటీ రోడ్డు వేసి, పెద్దపొర్ల గ్రామానికి బస్సులు నడపాలని వినతిపత్రం ఇచ్చారు. మంత్రి స్పందిస్తూ చిన్నపొర్ల, పెద్దపొర్ల మధ్య ఉన్న చెరువు కట్టను విశాలం చేయించి, కల్వర్టు నిర్మాణంతో పాటు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కొల్లూర్ గేటు నుంచి పెద్దపొర్ల గ్రామానికి బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, హౌసింగ్ డీటీ శంకర్, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్, తహసీల్దార్ చింత రవి, ఏవో గణే్‌షరెడ్డి, ఏఈ వెంకటప్ప, సీఐ రాంలాల్, మక్తల్, ఊట్కూర్ ఎస్‌ఐలు భాగ్యలక్ష్మీరెడ్డి, రమేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎం.బాల్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:15 PM