ఆనందం.. ఆవేదన!
ABN, Publish Date - Jan 23 , 2025 | 04:18 AM
వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!!
అర్హుల ప్రాథమిక జాబితాలో పేర్లున్నవారి సంతోషం.. పేర్లు రాలేదని తెలిసి ఆశావహుల్లో అసంతృప్తులు
మళ్లీ దరఖాస్తులు.. రెండోరోజు 3,888 గ్రామసభలు
నాలుగు పథకాల కోసం కొత్తగా 59,888 దరఖాస్తుల స్వీకరణ
సభల్లో పాల్గొన్న ఉత్తమ్, పొంగులేటి, పొన్నం, దామోదర
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!! రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్‌కార్డుల కోసం అర్హుల ఎంపిక కార్యక్రమం వరుసగా రెండోరోజు గ్రామసభల ద్వారా జరిగింది. అధికారులు సిద్ధం చేసి వెలువరించిన ప్రాథమిక జాబితాలో తమ పేర్లొచ్చిన వారు ఆనందపడితే పేర్లు లేకపోవడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొన్నిచోట్ల అధికారుల ఎదుటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో వారు మళ్లీ దరఖాస్తు పెట్టుకున్నారు. రెండోరోజు బుధవారం 3,888 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. 4 పథకాలకు 59,888 దరఖాస్తులొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి పొంగులేటి.. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో నీటిపారుదల, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి దామోదర హాజరయ్యారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, తొలిదశలో సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి అన్నారు.
పేదల్లో ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని దామోదర పేర్కొన్నారు. కాగా, ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాలిగొండలో పామర్తి శ్రీను అనే వ్యక్తి, తాను నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి డబ్బులిప్పించాలంటూ సెల్ టవర్ ఎక్కాడు. 2008లో శ్రీను ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాడు. డబ్బులు మాత్రం పామర్తి శ్రీను అనే పేరుతో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో పడ్డాయి. ఈ విషయం ఇటీవల సర్వేలో బయటపడింది. ఇల్లు నిర్మించుకున్న శ్రీను పంచాయితీ పెట్టడంతో మరో శ్రీను నుంచి డబ్బులు ఇప్పిస్తామని పెద్దలు హామీ ఇచ్చారు. అయితే బుధవారం జరిగిన గ్రామసభలో తనకు న్యాయం జరగలేదనే ఆవేదనతో ఇల్లు కట్టుకున్న శ్రీను సెల్‌టవర్ ఎక్కాడు. మధిర మండలం ఆత్కూరులో తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన బాలికకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. ఈ మేరకు గ్రామస్థులు ఏకగ్రీవంగా అధికారులకు సూచించడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కోమట్లగూడెంలో పథకాల జాబితాలో ఓ వర్గం పేర్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో దరఖాస్తుదారుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తూ గ్రామసభను బహిష్కరించిన గ్రామస్థులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో తన దరఖాస్తు మాయమైందం టూ చెన్న దేవేందర్ సభ సాక్షిగా నేలమీద పడుకొని నిరసన తెలిపాడు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం దస్నాపూర్ కాలనీలో జరిగిన సభలో తనకు వృధ్ధాప్య పింఛను ఇప్పించాలంటూ నిర్మలమ్మ.. ‘‘కాల్మొక్తసారూ కనికరించండి’’ అంటూ కలెక్టర్ రాజర్షి షా కాళ్లమీద పడి వేడుకుంది. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించడంతో నిర్మలమ్మ ఆనందం వ్యక్తంచేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ సిరిపాటి స్వరూప కంటతడి పెట్టుకుంది. 13 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం, ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నానని న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలో అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోతుండగా కారును అడ్డగించారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలోని 43వ డివిజన్‌లో... ఇందిరమ్మ ఇళ్ల జాబితా లో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి భార్య వైశాలిరెడ్డి పేరు ఉండటంతో బీజేపీనేతలు ఆందోళన చేశా రు. గతంలో ఉద్యమకారుల జాబితాలో 250 గజాల స్థలం కేటాయింపు కోసం ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నానని, అందుకే తన పేరు వచ్చిందని వైశాలిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సిరికొండలో... భూములున్న వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేశారని స్థానికులు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Updated Date - Jan 23 , 2025 | 04:18 AM