kumaram bheem asifabad- నేరాలను నియంత్రించాలి
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:11 PM
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నేరాలు నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలని చెప్పారు. నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సీసీ టవల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్, సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. నేరం చేసిన వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉంటూ సమర్థ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పంతో పోలీసు శాఖ లక్ష్యంగా పని చేయాలన్నారు. మహిళ భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించలన్నారు. కేసుల్లో విచారణ వేగవంతం పూర్తి చేసి చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందో బస్తు
ఆసిఫాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే లైసెన్స్ సర్వేయర్స్, గ్రామ పాలన ఆఫీసర్స్(జీపీవో), సీఆర్టీ పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైసెన్స్ సర్వేయర్ పరీక్ష ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏలకు గ్రామపాలన ఆఫీసర్స్(జీపీవో) పరీక్ష, ప్రభుత్వ ఆశ్రమ బాలుర హైస్కూల్, ప్రభుత్వ ఆశ్రమ బాలుర హైస్కూల్‌లలో సీఆర్టీ ఎస్‌జీటీ పరీక్షా ఏంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Updated Date - Jul 26 , 2025 | 11:11 PM