Contract Lecturers Telangana: ఉన్నత విద్యామండలి ముట్టడికి యత్నం
ABN, Publish Date - Apr 10 , 2025 | 05:19 AM
తెలంగాణలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగ భద్రత కోరుతూ ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించకుండా కొత్త నియామకాలపై జీఓ 21 తీసుకురావడాన్ని నిరసిస్తూ, మాసబ్‌ట్యాంక్‌లో ముట్టడి ప్రయత్నించారు.
క్రమబద్ధీకరణకు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన బాట
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించకుండా కొత్తగా అధ్యాపకుల నియామకం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21వ నంబర్ జీవో తేవడం పట్ల మండిపడ్డారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వివిధ వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు దశల వారీగా సైఫాబాద్‌లోని ఓయూ పీజీ కాలేజీ నుంచి వందల మంది ర్యాలీగా బయలుదేరి మహావీర్ ఆస్పత్రి వరకూ వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ అరెస్టులను మాజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఖండించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నేతలు పరశురామ్, ధర్మతేజ మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రిన్సిపాళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 05:19 AM