Revanth Reddy: పదేళ్లు అధికారం కాంగ్రెస్‌దే
ABN, Publish Date - Jun 25 , 2025 | 03:49 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2033 వరకూ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో పని చేస్తున్న వారికి 2029లో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పారు.
ఇప్పుడు పార్టీలో పనిచేసే వారికి వచ్చే టర్మ్‌లో ప్రభుత్వ పదవులు
పెరిగే సీట్లతో మరిన్ని అవకాశాలు.. 18 నెలల పాలన స్వర్ణయుగం
టీపీసీసీ నూతన కార్యవర్గానికి రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2033 వరకూ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో పని చేస్తున్న వారికి 2029లో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్టీ కోసం పని చేసేవారిని రానున్న పదేళ్లూ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ప్రకటించారు. గడిచిన 18 నెలల కాంగ్రెస్ పాలనను ముఖ్యమంత్రి స్వర్ణయుగంగా(గోల్డెన్ పిరియడ్) అభివర్ణించారు. ఈ 18 నెలల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలనపైన చర్చకు సవాల్ విసరాలంటూ సూచన చేశారు. టీపీసీసీ నూతన కార్యవర్గం మంగళవారం గాంధీభవన్‌లో భేటీ అయింది. టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్‌లో కార్యకర్త స్థాయి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, పీసీసీ చీఫ్‌ల స్థాయికి ఎదిగారని ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు నిర్వర్తించిన వారికి పదవులు వచ్చి తీరుతాయని చెప్పారు. టీపీసీసీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2018లో బాధ్యతలు తీసుకున్న తాను.. ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఎదిగానంటే అది పార్టీలో తాను నిర్వహించిన బాధ్యతలకు ప్రతిఫలమేనన్నారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. కొంతమంది పార్టీ నేతలు వివిధ అనుబంధ సంస్థల బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడలేదని రేవంత్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకున్న వారిలో 65 మందికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.. తదితర పదవుల్లో అవకాశాలు ఇచ్చామని ప్రస్తావించారు. కొత్తగా ఎంపికైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులు పార్టీ నిర్మాణంలో బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మండల, జిల్లా కమిటీల ఏర్పాటులో, సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడంలో భాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘పదవులతో ఇక రాజకీయ జీవితం నల్లేరుపై నడకని ఎవరూ అనుకోవద్దు. మీ నియామకం మూడేళ్లకు.. ప్రభుత్వం ఇంకా ఉండేది నాలుగేళ్లు. సరిగా పని చేయని వారిని ఎన్నికల ముందు ఆయా పదవుల నుంచి పీసీసీ అధ్యక్షుడు తప్పిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్న’’ అన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకున్న వారే రేపు నాయకులుగా ఎదుగుతారని రేవంత్ ఉద్బోధించారు. అప్పుడే పార్టీ బలోపేతమై రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంటే.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. 2014 నుంచి 2023 వరకూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉందన్నారు.
ఈ లెక్కన కాంగ్రెస్ 2033 వరకూ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికలు 2029లో అంటున్నారని, ఆ ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను కార్యవర్గ సభ్యులు తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ దళారులకు అడ్డాగా మారితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని రేవంత్ ప్రస్తావించారు. 18 నెలల్లో రైతుల కోసం రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. విద్యార్థులకు సబ్బులు, ఆహారం చార్జీలను పెంచామని, కులగణన సర్వేను నిర్వహించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సవాల్ విసిరామని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపామని చెప్పారు. పార్టీ నిర్మాణంలో టీపీసీసీ కార్యవర్గం క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం జరగాలని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ శాఖ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
పార్టీ పదవి అన్న చిన్నచూపు వద్దు!
పార్టీ పదవి అని చెప్పి చిన్న చూపు వద్దని, రేపు గొప్ప అవకాశాలను ఇచ్చేది పార్టీ పదవులేనని సీఎం అన్నారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా సీట్లు పెరగనున్నాయని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఆడబిడ్డలకూ అవకాశాలు మరిన్ని రాబోతున్నాయని చెప్పారు. కేంద్రం జమిలి ఎన్నికలు అంటోందని, ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయని, ఆ సమయానికి అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు.
Updated Date - Jun 25 , 2025 | 03:51 AM